- జాగృతిలో చేరండి మంచి పోస్ట్ ఇస్తా
- మహేశ్ గౌడ్‌కు కవిత ఓపెన్ ఆఫర్
- కాంగ్రెస్ ఓడిపోయే పార్టీ
- నేను కాంగ్రెస్ లో చేరతాననడం హాస్యాస్పదం
హైదరాబాద్, మహా : ఓడిపోయే పార్టీ కాంగ్రెస్, అందులో నేను చేరతాననడం హాస్యాస్పదమని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు కవిత ఓపన్ ఆఫర్ ఇచ్చారు. మహేశ్ గౌడ్‌ను జాగృతిలోకి ఆహ్వానిస్తున్నానని, జాగృతిలో చేరితే ఆయనకు మంచి పోస్ట్ ఇస్తానని అన్నారు. తనను కాంగ్రెస్‌లో చేర్చుకోమని టీపీసీసీ అధ్యక్షుడు అంటున్నారనిష అసలు నేనెందుకు కాంగ్రెస్ లో చేరుతానని అన్నారు. ఆదివారం జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత కాంగ్రెస్ పార్టీపై, టీపీసీసీ చీఫ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. రానున్న ఎన్నికల్లో జాగృతి గెలువబోతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తనను బద్నాం చేసే పనిలో మహేశ్ గౌడ్ ఉన్నారని ఆరోపించారు. తాను కాంగ్రెస్‌లో చేరతానని మహేశ్ కుమార్ గౌడ్‌కు కల వచ్చిందా..? అని ఎద్దేవా చేశారు. ఆయన మానసిక పరిస్థితి చెక్ చేసుకోవాలని హితవు పలికారు. బలమైన రాజకీయ పార్టీగా జాగృతిని మార్చే ప్రయత్నం చేస్తున్నానని కవిత పేర్కొన్నారు.
గుంట నక్కను గుడ్డిగా ఫాలో అయ్యారు
మాజీ మంత్రి హరీశ్‌రావు టార్గెట్‌గా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి కాంట్రాక్టులు ఇప్పించింది హరీష్ రావే అని అన్నారు. సృజన్ రెడ్డి పెద్ద తిమింగలంగా మారటానికి హరీశ్‌రావే కారణమని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి అని హరీశ్‌రావుకు అప్పుడు తెలియదా..?. హరీశ్‌రావు తవ్విన గుంతలో మాజీ మంత్రి కేటీఆర్ పడటం బాధాకరమన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు లేఖ రాయనని హరీశ్‌రావు అనటం దళిత ఉప ముఖ్యమంత్రిని అవమానించటమేనని అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మాత్రమే లేఖ రాస్తానని హరీశ్‌రావు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడగకుండా రాష్ట్రానికి సీబీఐ ఎలా వస్తుంది..?. సీనియర్ అయిన హరీశ్‌రావుకు ఈవిషయం తెలియదా? అని నిలదీశారు. 2014 నుంచి జరిగిన సింగరేణి టెండర్లపై విచారణ జరపాలని హరీష్ రావు అంటున్నారంటే కేసీఆర్ పాలనపై కూడా హరీశ్‌రావు విచారణ కోరుతున్నట్లే కదా..?’ అని కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. ‘హరీశ్‌రావు లేఖ రాయగానే కిషన్‌రెడ్డి మీటింగ్ పెడుతున్నారు. హరీశ్‌రావు బాధ అంతా ఆయన కమీషన్ల కోసమే. ఆయనకు చెందిన కంపెనీకి సింగరేణి టెండర్ ఎలా వచ్చిందని అడిగారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బొగ్గు గనులను తెలంగాణకు కేటాయించటానికి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ కాంట్రాక్టర్ల పక్షాన మాట్లాడటం బాధాకరమన్నారు. జీతాలు ఇవ్వటానికి కూడా సింగరేణి వద్ద నిధులు లేవని, జాగృతి రెండేళ్లుగా సింగరేణి టెండర్‌లపై మాట్లాడుతుంటే భట్టి విక్రమార్క కనీసం స్పందించలేదని మండిపడ్డారు. సింగరేణికి చెందిన 25టెండర్లలో ఎక్కువ బీఆర్ఎస్ నేతలకు చెందిన కంపెనీలకే దక్కాయన్నారు. , ఓబీ వర్క్స్‌కు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం తీసుకురావడం కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అని అన్నారు. సింగరేణి కార్మికుల కోసం జాగృతి పోరాటం చేస్తుందని కవిత స్పష్టం చేశారు.







