- నాంపల్లి ఫర్నిచర్ మాల్ అగ్నిప్రమాదం
- మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
- రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
హైదరాబాద్, మహా : నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఫర్నిచర్ మాల్‌లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందనకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అగ్నిమాపక నిబంధనలు, భద్రతా ప్రమాణాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ప్రాథమిక విచారణలో షాపు యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు తేలిందని, సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ ఘటనలో మృతి చెందిన వారిలో షాపు వాచ్ మన్ సమీర్ తల్లి బీ.బీ. అమ్మ (60), ఏడేళ్ళ బాలుడు అఖిల్, 11 సంవత్సరాల ప్రణిత్, రాజేంద్రనగర్ శాస్త్రీపురంకు చెందిన ఆటో డ్రైవర్ మొహమ్మద్ ఇంతియాజ్ (31), సయ్యద్ హబీబ్ (039 లు ఉన్నారని మంత్రి వెల్లడించారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన నియంత్రణ చర్యలు అమలు చేస్తామని తెలిపారు.







