నాగర్ కర్నూల్, మహా
నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నానమ్మకు బాగోలేదని తల్లిదండ్రులతో పాటు హైదరాబాదు నుండి వచ్చి సరదాగా వ్యవసాయ పొలానికి వెళ్లి అక్కడున్న నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడటంతో తల్లిదండ్రుల రోదనతో గ్రామంలో విశాద చాయలు అలుముకున్నాయి.. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి రజిని దంపతులు హైదరాబాద్లోని తుర్కయంజాల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా శ్రీకాంత్ రెడ్డి తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో , అదే సమయంలో ఊరుకొండ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను కూడా తిలకించవచ్చన్న ఉద్దేశంతో రెండు రోజుల సెలవు ఉండడంతో తన ఇద్దరు పిల్లలు స్నేహ (13) శ్రీమన్యు(11) పాటు తన అక్క చంద్రకళ,మేనకోడలు సిరి(12)ను కూడా వెంటబెట్టుకొచ్చాడు. ఈరోజు ఉదయం సరదాగా వ్యవసాయ పొలానికి చూడ్డానికి వెళ్లిన శ్రీకాంత్ రెడ్డి తన ఇద్దరు పిల్లలతో పాటు మేనకోడలు సిరి ని కూడా వ్యవసాయ పొలానికి తీసుకువెళ్లాడు. తన పొలంలోని నీటి గుంతలో ఈత కొట్టడానికి పిల్లలు ముచ్చటపడుతుండగా గుంత లోతును అంచనా వేయని శ్రీకాంత్ రెడ్డి దిగమని చెప్పడంతో పిల్లలు నీటి గుంతలో దూకి మునిగిపోతూ ఆర్తనాదాలు చేయడంతో ఒడ్డున ఉన్న శ్రీకాంత్ ఈత రాకపోవడంతో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకు రావడానికి వెళ్లి తిరిగి వచ్చే లోపు ముగ్గురు పిల్లలు కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. చుట్టుపక్కల వారు వచ్చి తాడు సాయంతో పిల్లల్ని బయటకు తీసి చూడగా నిర్జీవంగా పడి ఉన్న పిల్లలను చూసి బోరున విలపిస్తున్నాడు. తనకళ్ళ ముందే ముగ్గురు పిల్లలు విగతగాజీవులుగా మారడంతో అతన్ని ఆపడం ఎవరు తరం కావడం లేదు.. తల్లిదండ్రుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఊరుకొండ ఎస్సై కృష్ణదేవ తెలిపారు…








