Mahaa Daily Exclusive

  కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఘాతుకం: వరుస ఐఈడీ పేలుళ్లు.. 11 మంది భద్రతా సిబ్బందికి గాయాలు

Share

  • తెలంగాణ – ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని
  • కర్రెగుట్టల్లో ఐఈడీలు అమర్చిన మావోయిస్టులు
  • వరుస పేలుళ్లు..11 మంది భద్రతా సిబ్బందికి గాయాలు
  • భద్రతా సిబ్బంది గాయపడ్డ విషయాన్ని దృవీకరించిన అధికారులు

రాయ్ పూర్, మహా : ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా మావోయిస్టులు అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ పరికరాలు (ఐఈడీలు) పేలి 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని ఒక అధికారి తెలిపారు. తెలంగాణ సరిహద్దులోని ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట హిల్స్ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ కోసం భద్రతా సిబ్బంది సెర్చింగ్ చేస్తుండగా పేలుళ్లు సంభవించాయి. బీజాపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రాష్ట్ర పోలీసులలోని రెండు విభాగాలైన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్ జీ), బస్తర్ ఫైటర్స్, మరియు కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (కోబ్రా- సీఆర్పీఎఫ్ ఎలైట్ యూనిట్)కు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని అధికారులు చెప్పారు.

ఆపరేషన్ సమయంలో ఆరు పేలుళ్లు జరిగాయి. ఇందులో కనీసం 11 మంది సిబ్బంది గాయపడ్డారని, వారిలో 10 మంది డీఆర్‌‌జీకి చెందినవారు, ఒకరు కోబ్రాకి చెందినవారని అధికారులు వెల్లడించారు. గాయపడిన కోబ్రా సిబ్బంది రుద్రేష్ సింగ్ 210వ బెటాలియన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్. సింగ్‌తోపాటు ఇద్దరు డీఆర్‌జీ సిబ్బంది కాళ్లకు గాయాలయ్యాయి. మరో ముగ్గురి కళ్ళకు గాయాలయ్యాయని, గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా రాయ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. రాయ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గాయపడిన సిబ్బందికి చికిత్స అందించారు. శస్త్రచికిత్స జరిగిందని వైద్యులు తెలిపారు. గాయపడిన భద్రతా సిబ్బందికి ప్రాణాపాయం తప్పినట్టుగా అధికారులు తెలిపారు.

గత ఏడాది నవంబర్‌లో భద్రతా దళాలు కర్రెగుట్టలోని ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తడ్పాల గ్రామంలో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. ఇది సీనియర్ మావోయిస్టులకు సురక్షితమైన ఆశ్రయంగా పరిగణించేవారు. గత ఏడాది ఏప్రిల్-మే నెలల్లో కర్రెగుట్ట కొండల చుట్టూ ఉన్న దట్టమైన అడవుల్లో కేంద్ర, రాష్ట్ర భద్రతా దళాలు 21 రోజుల పాటు సమగ్ర ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఆ సమయంలో బలగాలు 35 ఆయుధాలు, 450 ఐఈడీలు, పెద్ద సంఖ్యలో డిటోనేటర్లు, పేలుడు పరికరాలు, వైద్య సామాగ్రి, విద్యుత్ పరికరాలు, విప్లవ సాహిత్యం మొదలైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి.