హైదరాబాద్, మహా : జూబ్లీహిల్స్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ నియోజకవర్గం నుంచి చదువుకున్న యువకుడిని నిలబెట్టి ప్రజలే గెలిపించారని పేర్కొన్నారు. రాజకీయాలు వ్యవస్థలో చాలా ముఖ్యమైనవని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అన్ని రోడ్డు పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం జూబ్లీహిల్స్‌లో పర్యటించిన ఆయన.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు ప్రజలకు సేవ చేయాలనే తపన ఉందని, అలాంటి నాయకుడితో కలిసి అభివృద్ధి పనులు చేయించుకోవాలని ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. భవిష్యత్తులో నవీన్ యాదవ్ పెద్ద స్థాయి నాయకుడిగా ఎదుగుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ అంటే చాలా అభివృద్ధి చెందిన ప్రాంతమని అనుకున్నప్పటికీ, ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు.







