- పోలీసులు నన్నేం చేయలేరు
- గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వార్నింగ్ లెటర్
- నేరుగా ఇంటికే పంపిన అగంతకుడు
హైదరాబాద్, మహా : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. అందులో అసభ్యకరమైన భాష ఉంది. తనపై పోలీసులు చర్యలు తీసుకోలేరని ఆ వ్యక్తి చెప్పడం కలకలం రేపుతోంది. ఆసిఫ్ నగర్‌కు చెందిన అబ్దుల్ హఫీజ్ అనే వ్యక్తి పేరుతో ఈ లేఖ వచ్చింది. గతంలోనూ రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇప్పుడు లేఖ రావడం చర్చనీయాంశమైంది. ఆ లేఖలో ‘నాకు పోలీసుల మద్దతు ఉంది. నన్ను ఏం చేయలేరు.’ అని రాసి ఉంది.
ఈ ఘటనపై రాజాసింగ్ మాట్లాడుతూ.. ‘ఆదివారం సాయంత్రం నా ఇంటి చిరునామాకు బెదిరింపు లేఖ వచ్చింది. బెదిరింపు కాల్స్ చేసి, బెదిరింపు లేఖలు పంపుతున్న వారు ఎవరు అని తెలుసుకోవాలని డీజీపీకి, కమిషనర్‌కు, ముఖ్యమంత్రికి కూడా లేఖలు రాశాం. వారిని పట్టుకోమని మేం కోరాం. కానీ పోలీసులు ఈ రోజు వరకు ఒక్క వ్యక్తిని కూడా పట్టుకోలేదు.’ అని రాజాసింగ్ అన్నారు.
నిన్న సాయంత్రం వచ్చిన లేఖలో ఆ వ్యక్తిని పోలీసులు తనను పిలిచినట్లు పేర్కొన్నాడు. ఫిర్యాదును ధృవీకరించి, ఆధార్ కార్డును తీసుకొని వదిలేశారని లేఖలో తెలిపాడు. పోలీసులు తనను ఏమీ చేయలేరని ఆ వ్యక్తి రాశాడు. ‘అతను ఈ మాటలు రాశాడు. ఇప్పుడు నా కొడుకును బెదిరిస్తున్నాడు. ఇది చాలా దురదృష్టకరం. అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల పాటలకు డ్యాన్స్ చేస్తూ తెలంగాణ పోలీసులు తోలుబొమ్మలుగా మారారు. పదేపదే బెదిరింపు కాల్స్, లేఖలు ఎవరు పంపుతున్నారో, ఏ పోస్టాఫీసు నుంచి పంపుతున్నారో తెలుసుకోవాలని డీజీపీ, కమిషనర్, ముఖ్యమంత్రిని కోరుతున్నాను. చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలు ఉండవచ్చు. వారిని పట్టుకోండి, విచారణ చేయండి.’ అని రాజాసింగ్ అన్నారు.
ఇలాంటి బెదిరింపు లేఖలతో తాను లేదా తన కుటుంబం భయపడబోమని రాజాసింగ్ నొక్కి చెప్పారు. తన తరువాత తన కొడుకు ధర్మం కోసం పని చేస్తూనే ఉంటాడని స్పష్టం చేశారు. తాము ఇప్పటికే తమ కొడుకును రాజకీయాల కోసం కాకుండా మతపరమైన పనుల కోసం ప్రొజెక్ట్ చేశామన్నారు. తన తర్వాత కుమారుడు కూడా మతపరమైన మార్గాన్ని అనుసరిస్తాడన్నారు. తన కుటుంబం మొత్తం ధార్మిక మార్గంలో నడుస్తుందన్నారు రాజాసింగ్. ఈ రకమైన బెదిరింపు కాల్స్ లేదా లేఖలతో తాము భయపడం అని స్పష్టం చేశారు.







