- కారేపల్లిలో రూల్స్ సపరేట్
- రాజ్యాంగ విరుద్ధమా… అధికార దుర్వినియోగమా..?
- *రిపబ్లిక్ డే ఆనవాయితీని మంట కలిపిన అధికారులు
- *జీపీ సెక్రటరీ లు ఆవిష్కరించాల్సిన జాతీయ జెండాలను ఎగరేసిన సర్పంచ్ లు
- *కారేపల్లి మండలంలో 41 జీపీల్లో సర్పంచులదే జెండా
కారేపల్లి, మహా:
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధానిలో భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరించారు… రాష్ట్ర రాజధానిలో గవర్నర్ త్రివర్ణ పతాకం ఎగురవేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో కలెక్టర్ జెండాను ఎగరవేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జెండాను ఆవిష్కరించారు. కారేపల్లి మండలంలోని అన్ని గ్రామపంచాయతీలల్లో జీపీ సెక్రెటరీలు ఉండగా సర్పంచులతోనే జెండాలను ఆవిష్కరించారు. జిల్లా పంచాయతీ అధికారి టెలి కాన్ఫరెన్స్ ఆదేశాల మేరకు సర్పంచులు ఎగురవేశారని మండల అధికారులు స్పష్టం చేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, రిపబ్లిక్ డే రోజు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధులు ఎగురవేయడం రాజ్యాంగ దినోత్సవ ఆనవాయితీని మంట గలి పారని రాజ్యాంగ స్ఫూర్తి కి నేషనల్ పాలసీ కి అధికారులు విరుద్ధంగా వ్యవహరించినట్లు పలువురు రాజకీయ నాయకులు పేర్కొంటున్నారు. 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. గణతంత్ర రాజ్యంగా భారత్ ఆవిర్భవించి 77 ఏళ్లయింది. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా పల్లెలు పరుగులు పెడుతుండగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కొందరు అధికారులు కొత్త ఒరవడిని సృష్టించి ఆనవాయితీలను అభాసు పాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎప్పుడూ లేనివిధంగా జిల్లా వ్యాప్తంగా సర్పంచులతో జాతీయ జెండాలను ఆవిష్కరింపజేసిన జిల్లా అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారా? అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.







