Mahaa Daily Exclusive

  మీడియా అక్రెడిటేషన్ జీవో సవరణ అరకొరే: టీడబ్ల్యూజేఎఫ్ నేత మామిడి సోమయ్య విమర్శ

Share

ప్రచురణార్ధం

అక్రెడిటేషన్ల జీవో సవరణ అభినందనీయం
-సవరణ సమూలంగా జరగలేదు
-నియోజకవర్గ స్థాయి, కేబుల్ చానెల్ రిపోర్టర్లకు మొండిచేయి
-టీడబ్ల్యూజేఎఫ్ నేత మామిడి సోమయ్య

హైదరాబాద్, జనవరి 26:
రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో తప్పుల తడకతో జారీ చేసిన మీడియా అక్రెడిటేషన్ల జీవోను 252 ఎట్టకేలకు సవరించడం
అభినందనీయమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య పేర్కొన్నారు.
అయితే ఈ జీవో సవరణ సమూలంగా జరగలేదని,కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని ఆయన అన్నారు. జీవో 252 జారీ చేసిన వెంటనే ఇది పూర్తిగా తప్పుల తడకగా, జర్నలిస్టులకు నష్టం కలిగే విధంగా ఉందంటూ తాము జీవో విడుదలైన రోజే స్పందించి వ్యతిరేకించామని, ఈ జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేశామని ఆయన తెలిపారు. ఆ తర్వాత జర్నలిస్టు సంఘాల జేఏసీతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి రాష్ట్ర సమాచార శాఖ మంత్రికి, కమీషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, జీవో 252 ను సవరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేశామని తెలిపారు. ఎట్టకేలకు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 10న జర్నలిస్టు సంఘాలతో సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారని, ఈ సమావేశానికి టీడబ్ల్యూజేఎఫ్ సంఘం నుంచి తాను హాజరయ్యానని, ఆ సమావేశంలో తాము పెట్టిన డిమాండ్లలో కేవలం రెండు, మూడు అంశాలను మాత్రమే ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని జీవో 252 ను సవరించడం జరిగిందని అన్నారు. డెస్క్ జర్నలిస్టులకు సైతం అక్రిడిటేషన్ కార్డులే ఇవ్వాలన్న డిమాండ్ కు అంగీకరించి సవరణ జీవో జారీ చేశారని, అదే విధంగా మండల స్థాయిలో లక్షన్నరకు పైగా జనాభా ఉన్నచోట అదనపు అక్రెడిటేషన్ కార్డులిస్తామని పేర్కొనడంతో పాటు కల్చరల్, స్పోర్ట్స్, సినిమా జర్నలిస్టులకు సైతం ప్రత్యేకంగా కార్డులు జారీ చేస్తానని సవరణ జీవోలో ప్రకటించడం అభినందనీయమని, ఈ సవరణ విషయంలో తమ సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తుందని మామిడి సోమయ్య తెలిపారు. అయితే ప్రస్తుతం సవరించిన జీవో ప్రకారం గతంలో వచ్చినన్ని అక్రిడేషన్ కార్డులు వస్తాయనే నమ్మకం కూడా లేదని, కార్డుల సంఖ్య భారీగా తగ్గనున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసి పాత జీవో 239 ప్రకారం జారీ అయిన కార్డుల సంఖ్యను తగ్గించకుండా చూడాలని టీడబ్ల్యూజేఎఫ్ కోరుతుందని అన్నారు.

కేబుల్ చానళ్ళు,నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులకు మొండి చేయి
అక్రెడిటేషన్ల జీవో 252 సవరణలో జర్నలిస్టులకు పూర్తిస్థాయి న్యాయం జరగడం లేదని, కేబుల్ చానళ్ళకు, నియోజకవర్గ స్థాయి రిపోర్టర్లకు మరోసారి మొండి చెయ్యి చూపించడం జరిగిందని మామిడి సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేబుల్ ఛానల్స్ కు ఐ అండ్ పీఆర్ ద్వారా 12 రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కార్డులు, నాలుగు జిల్లా స్థాయి కార్డులు ఇచ్చేవారని, ఇప్పుడు కనీసం అదే పద్దతిలో ఇవ్వాలన్న విషయాన్ని తాను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఈ సవరణ జీవో లో కేబుల్ చానల్స్ అంశమే లేకపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. అదే విధంగా నియోజకవర్గ స్థాయి అక్రెడిటేషన్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. తాను మా యూనియన్ పరంగా తమ అభిప్రాయాన్ని గట్టిగా చెప్పినప్పటికీ కేబుల్ చానల్ రిపోర్టర్లకు, నియోజకవర్గ స్థాయి రిపోర్టర్లకు ఇచ్చే అక్రెడిటేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని, ఈ విషయమై సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ను వెంటనే కలిసి మరోమారు చర్చిస్తామని, అప్పటికీ స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని మామిడి సోమయ్య తెలిపారు.