Mahaa Daily Exclusive

  క్రమశిక్షణ తప్పిన ఖాకీలు…

Share

  • క్రమశిక్షణ తప్పిన ఖాకీలు
  • పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా
  • ఏసీపీ వర్సెస్ ఎస్సై
  • కేసు ఫైళ్ల కోసం ఇద్దరి మధ్య ‘వార్’

హైదరాబాద్, మహా : శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు శాఖలో క్రమశిక్షణ తప్పింది. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ఒక కీలక డివిజన్‌లో ఏసీపీ ర్యాంక్ ఉన్నతాధికారి అడ్మిన్ ఎస్సై మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇతర సిబ్బంది ముందే వీరిద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకోవడం, చివరకు ఈ వ్యవహారం ఉన్నతాధికారుల వరకు వెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ఒక పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇటీవల సెలవుపై వెళ్లారు. ఆయన లేని సమయంలో డివిజన్ ఏసీపీ కొన్ని కీలక కేసులకు సంబంధించిన ఫైళ్లను తన వద్దకు తీసుకురావాలని స్టేషన్ అడ్మిన్ ఎస్సైని ఆదేశించారు. అయితే ఆ ఎస్సై ఏసీపీ ఆదేశాలను సున్నితంగా తిరస్కరించారు. ‘ఎస్‌హెచ్‌వో గారు సెలవులో ఉన్నారు. ఆయనకు తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా ఫైళ్లను బయటకు తీసుకురావడం నిబంధనలకు విరుద్ధం’ అని బదులిచ్చారు.

ఎస్సై సమాధానంతో ఆగ్రహానికి గురైన ఏసీపీ.. పై అధికారినైన నా ఆదేశాలనే ధిక్కరిస్తావా ? అంటూ గట్టిగా మందలించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి స్టేషన్ సిబ్బంది చూస్తుండగానే ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకున్నారు. ఉన్నతాధికారి అని చూడకుండా ఎస్సై ఎదురుతిరగడం, ఏసీపీ కూడా పట్టుబట్టడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సదరు ఫైళ్లు అత్యంత కీలకమైన కేసులు కావడంతోనే ఏసీపీ వాటిని అడిగారని, కానీ ప్రోటోకాల్ విషయంలో ఎస్సై పట్టుబట్టారని తెలుస్తోంది. ఠాణాలో జరిగిన ఈ వ్యవహారం కమిషనరేట్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. వెంటనే స్పెషల్ బ్రాంచ్ అధికారులు రంగంలోకి దిగి ప్రాథమిక విచారణ చేపట్టారు. అసలు గొడవకు కారణమేంటి ? ఆ ఫైళ్లలో ఏముంది ? ఎస్సై ఎందుకు నిరాకరించారు ? అనే కోణంలో విచారణ జరిపి ఒక నివేదికను రూపొందించారు. ఈ నివేదికను ఇప్పటికే ఉన్నతాధికారులకు సమర్పించినట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఈ ఘటన పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది.