Mahaa Daily Exclusive

  ఉమ్మడి నల్గొండలో ‘పుర’ పోరు.. నేటి నుంచే నామినేషన్ల పర్వం!

Share

  • ఉమ్మడి నల్గొండలో ‘పుర’ పోరు.. నేటి నుంచే నామినేషన్ల పర్వం!
  • 17 మున్సిపాలిటీలు.. 6.70 లక్షల మంది ఓటర్లు,అభ్యర్థుల ఖరారుపై పార్టీల కుస్తీ..
  • గెలుపు గుర్రాల కోసం అన్వేషణ
    కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ..
  • అక్కడక్కడ కమలం, వామపక్షాల ప్రభావం..

నల్గొండ మహా ప్రతినిధి : ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. నోటిఫికేషన్ విడుదల కావడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బుధవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండటంతో ఆశావహుల హడావుడి మొదలైంది. నామినేషన్లకు గడువు కేవలం మూడు రోజులే ఉండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రధాన పార్టీలకు సవాలుగా మారింది. జిల్లాలో నల్గొండ కార్పొరేషన్‌తో పాటు మొత్తం 17 మున్సిపాలిటీలకు (నకిరేకల్ మినహా) ఎన్నికలు జరగనున్నాయి.

పార్టీ గుర్తుపై పోరు.. ప్రతిష్ఠాత్మకం..

గ్రామ పంచాయతీ ఎన్నికల వలె కాకుండా, మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతుండటంతో ప్రధాన పార్టీలు దీనిని అగ్నిపరీక్షగా భావిస్తున్నాయి.అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. అయితే, టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండటంతో రెబెల్స్ భయం పార్టీని కలవరపెడుతోంది.
బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీనిచ్చి పుంజుకున్న బీఆర్ఎస్, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి పూర్వ వైభవం సంపాదించాలని చూస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్-ఛార్జిలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో వ్యూహాలకు పదును పెడుతున్నారు. కొన్ని వార్డుల్లో బీజేపీ, సీపీఎం తమదైన ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఓటర్ల లెక్కల్లో మహిళలదే పైచేయి..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 162 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో సగానికి పైగా సీట్లను మహిళలకు కేటాయించారు.
* మొత్తం ఓటర్లు: 6,68,455
* పురుషులు: 3,23,613
* మహిళలు: 3,44,713
ఓటర్ల జాబితాలో మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో వారు కీలక పాత్ర పోషించనున్నారు.

ఉమ్మడి జిల్లా వారిగా మున్సిపాలిటీల వివరాలు..

నల్గొండ : నల్గొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, చిట్యాల, చండూరు, నందికొండ, హాలియా, దేవరకొండ.. నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా మారుస్తూ ఇటీవలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నూతనంగా ఏర్పడ్డ నల్గొండ కార్పొరేషన్ లో 48 డివిజన్ల లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు.

సూర్యాపేట: సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల

యాదాద్రి: భువనగిరి,ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి

యాదాద్రిలో హోరాహోరీ..

యాదాద్రి భువనగిరి జిల్లాలోని 6 మున్సిపాలిటీలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. గత పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ సమానంగా స్థానాలు సాధించడంతో, ఈసారి పురపాలక ఎన్నికల్లో ఆధిక్యం సాధించి గులాబీ పార్టీని దెబ్బకొట్టాలని కాంగ్రెస్ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. అటు బీఆర్ఎస్ సైతం తమ పట్టును నిరూపించుకోవాలని భావిస్తుండటంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారింది.