- ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కౌశిక్ రెడ్డిలకు స్పీకర్ నోటీసులు
- ఈ 30న విచారణకు రావాలని ఆదేశాలు
- దానం పార్టీ పిరాయించాడని స్పీకర్ కు ఫిర్యాదు చేసిన కౌశిక్ రెడ్డి
హైదరాబాద్, మహా : తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం నోటీసులు జారీ చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సైతం స్పీకర్ నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. జనవరి 30న విచారణకు హాజరు కావాలని తన నోటీసుల్లో స్పీకర్ పేర్కొన్నారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన దానం నాగేందర్, అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానం నాగేందర్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కూడా క్రమశిక్షణారాహిత్యం,ఇతర రాజకీయ కారణాలతో ఫిర్యాదులు అందాయి. సుప్రీంకోర్టు గతంలోనే ఫిరాయింపుల ఫిర్యాదులపై నిర్ణీత కాలపరిమితిలోగా చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించిన క్రమంలో దానం నాగేందర్‌తో పాటు కౌశిక్ రెడ్డికి సైతం నోటీసుల జారీకి ప్రాధాన్యత ఏర్పడింది.
మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదులు వచ్చాయి. విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లగా చర్యలు తీసుకోవాలని, లేక ఆయన నిర్ణయం తెలపాలని స్పీకర్ ను కోర్టు పలుమార్లు ఆదేశించింది. అనర్హత పిటిషన్లు ఎదుర్కొన్న వారిలో బండ్ల కృష్ణ మోహన్, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇదివరకే క్లీన్ చిట్ ఇచ్చారు. వీరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. మిగతా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ లకు సంబంధించి స్పీకర్ విచారణ చేయాల్సి ఉంది. తాజాగా దానంకు నోటీసులు జారీ చేశారు.








