- జైళ్లలో సంస్కరణలు, బలోపేతంపై కేంద్రం ఫోకస్
- జైళ్ల ఆధునీకరణ, హైసెక్యూరిటీ జైళ్ల నిర్మాణం కోసం రూ.950 కోట్ల కేటాయింపు
- పేద ఖైదీలకు మద్దతు పథకం కింద ఏటా రూ.20 కోట్లు కేటాయింపు
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
- విశాఖలో ‘‘జైలు అధికారుల 9వ జాతీయ సమ్మేళం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంజయ్
విశాఖపట్టణం, మహా : దేశవ్యాప్తంగా జైళ్ల బలోపేతంతోపాటు ఆయా జైళ్లను సంస్కరించి ఖైదీల్లో మార్పు తీసుకురావడంపై కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. జైళ్ల ఆధునీకరణ ప్రాజెక్టు కింద రూ.950 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.. హై-సెక్యూరిటీ జైళ్లతోపాటు ఆయా జైళ్లలో భద్రతా మౌలిక సదుపాయాల బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలోని సాయిప్రియా రిసార్ట్ట్స్ రెండ్రోజులపాటు నిర్వహించిన ‘‘జైలు అధికారుల 9వ జాతీయ సమ్మేళం’ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బీపీఆర్ డీ డైరెక్టర్ అలోక్ రంజన్, ఏపీ జైళ్ల శాఖ డీజీ అంజనీకుమార్, ఉన్నతాధికారులు రవి లోకు, జితేంద్ర మీనా, తెలంగాణ జైళ్ల డీజీ సౌమ్య మిశ్రాతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ సదస్సు ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పరస్పర అనుభవాలను పంచుకునే అవకాశం లభించడమే కాకుండా, ఉత్తమ ఆచరణల, వినూత్న కార్యక్రమాల, విధానపరమైన అవసరాలుపై లోతైన చర్చ జరగడం ద్వారా జైలు పరిపాలన నాణ్యతను మెరుగుపర్చేందుకు అవసరమైన కార్యాచరణకు మార్గం సుగమం చేస్తోందన్నారు.
కస్టడీలో ఉంటూ దుర్బల జీవితాన్ని అనుభవిస్తున్న పేద ఖైదీల సంరక్షణ, మోడల్ జైలు ప్రమాణాల అమలు, ఖైదీల విడుదల అనంతర పునరావాసం వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. పేద ఖైదీలకు మద్దతు పథకం, జైళ్ల ఆధునీకరణ ప్రాజెక్టు అమలులో వ్యూహాలు, మోడల్ ప్రిజన్ మాన్యువల్–2016, మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ చట్టం–2023 అమలులో సవాళ్లపైనే ఈ సదస్సులో చర్చించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత – సెక్షన్ 479 అమలు, జైళ్లలో సాంకేతికత వినియోగం, ఆధార్ ధృవీకరణ, వీడియో కాన్ఫరెన్సింగ్, టెలీమెడిసిన్, జైలు శిక్షణా సంస్థల ప్రామాణీకరణ & గుర్తింపు వంటి అంశాలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. జైళ్లలో సంస్కరణలకు విధాన మార్గదర్శకాలు, చట్టపరమైన నిర్మాణం, లక్ష్యిత పథకాల ద్వారా కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నిరంతరం మార్గదర్శనం చేస్తోందని, పేద ఖైదీలకు మద్దతు పథకం కింద ఏటా రూ.20 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 237 మంది ఖైదీలకు ఈ పథకం ద్వారా ఉపశమనం లభించిందని మంత్రి తెలిపారు. జైళ్ల ఆధునీకరణ ప్రాజెక్టు కింద మొత్తం రూ.950 కోట్లు కేటాయించామని, హై-సెక్యూరిటీ జైళ్లు మరియు భద్రతా మౌలిక సదుపాయాల బలోపేతమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.101.45 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. బీపీఆర్ అండ్ డీ పరిశోధనాధారిత ప్రమాణాలు, సామర్థ్యవృద్ధి కార్యక్రమాల ద్వారా మానవీయ, సురక్షిత, సంస్కరణాత్మక జైలు వ్యవస్థ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందని, జాతీయ జైలు శిక్షణ విధానం–2025 ద్వారా మానవ హక్కులు, వృత్తి నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. 1997 నుంచి ఇప్పటివరకు 701 శిక్షణా కోర్సులు నిర్వహించి 15,875 మంది జైలు అధికారులకు శిక్షణ అందించడం జరిగిందన్నారు. జైలు పరిపాలన రాష్ట్ర అంశమైనప్పటికీ, కేంద్రం–రాష్ట్రాల సమన్వయంతో సురక్షితమైన, మానవీయమైన, పునరావాస దృష్టితో కూడిన జైలు వ్యవస్థను నిర్మించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం కావాలని మంత్రి ఆకాంక్షించారు.







