ఎవరూ లేని వారికి అండగా నిలిచిన మానవత్వం
పేద కుటుంబానికి వైయస్ రెడ్డి ట్రస్ట్ భరోసా
చర్లపల్లి, మహా : గ్రేటర్ హైదరాబాద్ పోచారం డివిజన్ పరిధి ప్రతాప్ సింగారం గ్రామానికి చెందిన పేద కుటుంబ సభ్యులు బెల్లంపల్లి వెంకటేష్ రెడ్డి, బెల్లంపల్లి ప్రభాకర్ రెడ్డి కి ఎవరూ లేక జీవనాధారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న వైయస్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి వెంటనే స్పందించారు. వైయస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో వారికి రైస్ కుక్కర్,ఫ్యాన్, హ్యాండీక్యాప్డ్ స్టాండ్లను బీజేపీ యువమోర్చా నాయకులు శివాజీ,ముఖేష్ల ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెల్లంపల్లి వెంకటేష్ రెడ్డి కి కాలు బాలేకపోవడంతో అవసరమైన శస్త్రచికిత్స (సర్జరీ) చేయిస్తానని హామీ ఇవ్వడం ఎంతో సంతోషకరమని తెలిపారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే వైయస్ రెడ్డి ట్రస్ట్ లక్ష్యమని, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ట్రస్ట్ ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. వైయస్ రెడ్డి ట్రస్ట్ అందిస్తున్న ఎనలేని సేవలు పేద ప్రజల్లో కొత్త ఆశను నింపుతున్నాయని గ్రామస్తులు కొనియాడారు.







