Mahaa Daily Exclusive

  బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్..!

Share

కరీంనగర్, మహా : బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కరీంనగర్ జిల్లాలోని వీణవంకలో అదుపులోకి తీసుకుని సైదాపూర్ పోలీస్ స్టేషన్‎కు తరలించారు. పోలీసులపై దుర్భషలాడడం, విధులకు ఆటంకం కలిగించడం, దౌర్జన్యం చేయడం వంటి అభియోగాలపై అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా వీణ వంక లోకల్ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తుంటే పోలీస్‎లు తమను అడ్డుకున్నారని తన కుటుంబంతో కలిసి హుజరాబాద్‎లో రోడ్డుపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బైఠాయించారు. రోడ్డుపై బైఠాయించిన పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి పోలీసులపై రెచ్చిపోయారు. పోలీసుల మీదకు దూసుకెళ్లి బెదిరించారు. ‘భవిష్యత్తులో రేపు మీ కంటే పెద్ద పొజిషన్‎లో ఉంటా. మీ కంటే ఎక్కువ పవర్ నాకు ఉంటుంది. నా ఇంట్లో పండగ లేకుండా చేస్తున్నారు. నాపైన ఎన్ని కేసులైనా పెట్టుకోండి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కని సంగతి చూస్తా. వీణవంకలో సమ్మక్క పండగ చేసుకోకుండా అడ్డుకున్నారు’ అని సీఐకి వార్నింగ్ ఇచ్చారు. కరీంనగర్ సీపీ పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు . ఈ నేపథ్యంలోనే పోలీసులపై దుర్భషలాడడం, విధులకు ఆటంకం కలిగించడం, దౌర్జన్యం చేయడం వంటి అభియోగాలపై అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు .