Mahaa Daily Exclusive

  60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు..!

Share

  • 60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు
  • కల్తీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదని సిట్ నిర్దారించలేదు
  • వైసీపీ ప్రచారంపై టీటీడీ చైర్మన్ ఆగ్రహం
  • హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • సిట్ చార్జీషీట్ లో లోపాలున్నాయి
  • అవసరమైతే కోర్టుకు వెళ్తాం

 

తిరుపతి, మహా : తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో తిరుమలను ఒక ప్రణాళికాబద్ధమైన కుట్రతో భ్రష్టు పట్టించారని ఆరోపించారు. వైసీపీ నేతలు చేస్తున్న యజ్ఞాలు, ఇస్తున్న క్లీన్ చిట్ ప్రకటనలపై తీవ్రంగా స్పందిస్తూ, హిందూ సమాజానికి జగన్ , ఆయన అనుచరులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్ నివేదికలో ఎక్కడా జంతువుల కల్తీ జరగలేదని నిర్దారించలేదని ఆయన స్పష్టం చేశారు.

 

కల్తీ నెయ్యి కొనుగోలు – రూ. 20 కోట్ల లడ్డూల పాపం

 

వైసీపీ హయాంలో నిబంధనలను తుంగలో తొక్కి, సామర్థ్యం లేని డైరీలకు టెండర్లు కట్టబెట్టారని నాయుడు ఆరోపించారు. సుమారు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని కొనుగోలు చేసి, దానితో 20 కోట్ల లడ్డూలను తయారు చేసి పంపిణీ చేశారని అన్నారు. నెయ్యిలో జంతు కొవ్వు లేదని వైసీపీ నేతలు చెబుతుండటం సిగ్గుచేటని, అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ వాడి నెయ్యి తయారు చేశారని సిట్ ఛార్జ్ షీట్ లోనే స్పష్టంగా ఉందని ఆయన గుర్తు చేశారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడి హిందువుల ప్రాణాలతో ఆడుకున్నారని దుయ్యబట్టారు. ఎన్డీడీబీ రిపోర్టులో కొవ్వు ఉందని రిపోర్టు వచ్చింది కాబట్టే సీఎం, మంత్రులు స్పందించారని అన్నారు.

 

సిట్ విచారణ , పెద్దల ప్రమేయం

 

సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కొన్ని లోపాలు ఉన్నాయని, కేవలం చిన్న స్థాయి వ్యక్తులపైనే కాకుండా ఈ కుట్ర వెనుక ఉన్న పెద్ద తలకాయలను వెలికితీయాలని బి.ఆర్. నాయుడు డిమాండ్ చేశారు. జగన్, వైవీ సుబ్బారెడ్డిల ప్రమేయం లేకుండా కేవలం పీఏ స్థాయి వ్యక్తులు ఇంత పెద్ద కుంభకోణం చేయలేరని ఆయన అభిప్రాయపడ్డారు. వైవీ సుబ్బారెడ్డి దంపతులు తమ బ్యాంక్ వివరాలను సిట్ కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నెయ్యి కల్తీపై నూటికి నూరు శాతం నిజం బయటపడాలంటే మైక్రో డీఎన్ఏ టెస్ట్ చేయాలని, ఇందుకోసం కోర్టును ఆశ్రయిస్తామని ఆయన వెల్లడించారు.

 

యజ్ఞాలపై ఎద్దేవా – భూమనకు ప్రాణభయం

 

మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న యాగంపై బి.ఆర్. నాయుడు సెటైర్లు వేశారు. తప్పు చేసిన వారికి తల వెయ్యి ముక్కలు అవుతుందనే భయం ఉండబట్టే భూమన ఇలాంటి యాగాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని యాగాలు చేసినా చేసిన పాపం పోదని, హిందూ సమాజంపై దాడి చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. తిరుమలను వాటికన్ సిటీలా మార్చాలని చూశారని, భక్తుల రక్షణ కోసం హిందువులందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.

 

తిరుమల ప్రక్షాళన

 

గత ప్రభుత్వం చేసిన అరాచకాల నుంచి తిరుమలను కాపాడుకోవడమే తమ మొదటి ప్రాధాన్యతని నాయుడు స్పష్టం చేశారు. సిట్ సమర్పించింది కేవలం ప్రాథమిక ఛార్జ్ షీట్ మాత్రమేనని, ముందు ముందు మరిన్ని నిజాలు బయటకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కల్తీకేటుగాళ్లను జైలుకు పంపించే వరకు తాము విశ్రమించబోమని, ప్రతి విషయంలోనూ నిబంధనలను తూట్లు పొడిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.