- గౌరవెల్లి ప్రాజెక్టు కుడి కాలువ పనులు వేగవంతం
- భూ సేకరణకు త్వరలో రూ.54.55 కోట్లు
- మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో డి4 కాలువ పనులు ముమ్మరం
కరీంనగర్, మహా: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్ మండలాల పరిధిలోని 15,631 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కీలకమైన గౌరవెల్లి ప్రాజెక్టు కుడి కాలువ (డి4) పనులు వేగవంతమయ్యాయి. ఈ కాలువ నిర్మాణానికి భూసేకరణ కొలిక్కి వచ్చింది. భూ సేకరణకు కావలసిన నిధులు త్వరలో మంజూరు కానున్నాయి. చిగురుమామిడి, సైదాపూర్ మండలాల పరిధిలోని 15,631 ఎకరాలకు సాగునీరు అందించేందుకు గౌరవెల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కాలువ D4 ఎంతో కీలకమైనది. ఈ కాలువ నిర్మాణానికి కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాల పరిధిలో 260 ఎకరాల భూమి అవసరంగా గుర్తించారు. భూ సేకరణలో ఎదురైన సమస్యలు, రైతుల అభ్యంతరాలు, పరిహారం చెల్లింపులో జాప్యం వంటి అంశాల్లో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ చూపారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో తరచూ సమీక్షిస్తూ భూ సేకరణ కోసం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా న్యాయమైన పరిహారం పారదర్శకంగా చెల్లించాలన్న సంకల్పంతో ముందుకెళ్లారు. ఫలితంగా భూ సేకరణ వేగవంతమైంది.
భూ సేకరణకు 54.55 కోట్ల రూపాయల నిధుల విడుదలకు ట్రెజరీ శాఖలో టోకెన్ జనరేట్ అయింది. పరిహారం చెల్లింపుగాను ఈ నిధులు త్వరలో విడుదల కానున్నాయి. దీంతో గౌరవెల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కాలువ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకోనుంది. ఈ కాలువ నిర్మాణం పూర్తయితే చిగురుమామిడి, సైదాపూర్ మండలాల పరిధిలోని రైతులకు, పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు జరుగనుంది. వ్యవసాయ ఉత్పాదకత పెరిగి రైతులు రైతు కూలీల జీవనోపాధికి ఈ కాలువ ఎంతో ఉపకరిస్తుంది.








