Mahaa Daily Exclusive

  కోఠి ఎస్ బీఐ వద్ద కాల్పులు….

Share

  • కోఠి ఎస్ బీఐ వద్ద కాల్పులు
  • వ్యక్తిని గన్‌తో కాల్చిన దుండగులు
  • రూ.6 లక్షలు అపహరణ
  • పోలీసులను ఏమార్చేందుకు డ్రస్ లు మార్చుకున్న అగంతకులు
  • అగంతకుల గాలింపు కోసం రంగంలోకి ఐదు బృందాలు

హైదరాబాద్, మహా : హైదరాబాద్ మహా నగరంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నగరం నడిబొడ్డున ఉన్న కోఠి ఎస్‌బీఐ బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద సినీ ఫక్కీలో కాల్పులు జరిపారు గుర్తు తెలియని దండగులు. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డిపాటిట్ చేసేందుకు వెళ్లిన రషీద్ అనే వ్యక్తిపై కాల్పులకు తెగబడ్డారు. అనంతరం అతడి వద్ద నుంచి రూ.6 లక్షల నగదుతో ఉడాయించారు. ఈ ఘటనలో రషీద్ కాలికి బుల్లెట్ తగిలి తీవ్రగాయమైంది. గమనించిన స్థానికులు హుటాహుటిన అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రషీద్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు.

కాల్పుల సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సాయంలో ఆధారాలు సేకరిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాల ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు. కాల్పులకు తెగబడింది ఎవరు..? డబ్బుల సమాచారం వారికి ఎలా తెలిసింది..? ఇది తెలిసిన వారి పనేనా..? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. త్వరలోనే కాల్పులు జరిగిన దుండగులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు సుల్తాన్ బజార్ ఏపీసీ వెల్లడించారు. రషీద్‌ను బెదిరించి డబ్బులు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని, అతడు ఎదురు తిరగటంతో కాళ్లపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. రషీద్ నాంపల్లిలో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారని, వ్యాపారానికి సంబంధించిన డబ్బులు ఏటీఎం మెషీన్‌లో డిపాజిట్ చేసేందుకు వెళ్లిన సమయంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. కచ్చితంగా తెలిసిన వారు, పాత నేరస్తుల పనే అయి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఏటీఎం పరిసరాల్లోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, అందులో లభించే ఆధారాలను బట్టి నిందితులను పట్టుకుంటామని చెప్పారు. గతేడాది నగరంలో కాల్పులు జరిగాయని, ఆ తర్వాత మరోసారి కాల్పులు జరిగినట్లు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున డబ్బులు తరలించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

కాల్పులకు తెగబడి నగదుతో పరారైన దుండగులు పోలీసులను తప్పుదారి పట్టించేందుకు శత విధాలా ప్రయత్నించినట్లు సీసీ పుటేజీలను పరిశీలించిన అనంతరం దర్యాప్తు బృందాలు నిర్ధారణకు వచ్చాయి. కోఠి నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ వెళ్ళిన అగంతకులు స్టేషన్ లోకి వెళ్ళినట్లే వెళ్ళి తిరిగి బయటకు వచ్చి ఆటోలో సికింద్రాబాద్ వైపు పారిపోయారని గుర్తించారు. ప్రస్తుతం అటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అగంతకులు ఎటు వైపు వెళ్ళారు, వారి ఆనవాళ్ళు, ముఖ కవలికలు, వారు ఏ భాషలో మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారన్న వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వీలైనంత తొందరగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.