Mahaa Daily Exclusive

  ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ విచారణకు కేసీఆర్ సిద్ధం.. తెలంగాణలో హైటెన్షన్!

Share

  • సిట్ విచారణకు కేసీఆర్ సై
  • సిట్ ఏసీపీకి ఆరు పేజీల లేఖ రాసిన కేసీఆర్
  • చట్టపరమైన అభ్యంతరాలున్నా విచారణకు సహకరిస్తానని హామీ
  • నంది నగర్ నివాసం వద్ద పోలీసుల భారీ బందోబస్తు
  • కేటీఆర్. హరీష్, సంతోష్ ల విచారణలోని అంశాలతో కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశం
  • భారీ నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపు

హైదరాబాద్, మహా : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచరకణకు కేసీఆర్ సిద్ధమయ్యారు. నందినగర్ లోని తన నివాసంలో సిట్ విచారణకు కేసీఆర్ ఓకే చెప్పారు. దీంతో రెండు రోజుల ఉత్కంఠతకు తెరపడింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ పార్టీ కీలక నేతలు, న్యాయ నిపుణులతో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడా అవకాశం ఇవ్వకూడదని, చట్టాన్ని గౌరవిస్తూనే ప్రజాక్షేత్రంలో గట్టి సమాధానం చెప్పాలని గులాబీ దళం భావిస్తోంది. ఆదివారం సాయంత్రం 3 గంటలకు నందినగర్ నివాసంలో విచారణ జరగనుండటంతో, కేసీఆర్ ఆదివారం ఉదయమే ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు.

సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని సిట్ ఏసీపీకి ఆరు పేజీల లేఖ రాసిన కేసీఆర్ దర్యాప్తు అధికారులు వ్యవహరించిన తీరుపై ఆక్షేపిస్తూ పలు ప్రశ్నలను లేవనెత్తారు. గోడకు నోటీసులు అంటించడం సరైంది కాదవని, ఇది తన ప్రతిష్టకు భంగం కలిగించే చర్య అని పేర్కొన్నారు. ొల నోటీసులను గౌరవించి రిప్లై ఇచ్చానని, అయినా రాత్రి పూట ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్ళడం వెనుక మీరు పొందిన పైశాచిక ఆనందం ఏమిటని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తినని, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని, ఎక్కడా పోలీసులకు, దర్యాప్తు అధికారులకు సహకరించకుండా తప్పించుకోలేదని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. మాజీ సీఎంను అన్న గౌరవం కూడా లేకుండా దర్యాప్తు అధికారులు వ్యవహరించిన తీరుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ ఆత్మగౌరవ నినాదం- రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు

కేసీఆర్ విచారణను కేవలం ఒక దర్యాప్తుగా కాకుండా, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై జరిగిన దాడిగానే బీఆర్ఎస్ అభివర్ణిస్తోంది. తెలంగాణ సాధించిన ఉద్యమ నేతను కావాలనే అవమానిస్తున్నారని మండిపడుతున్న పార్టీ శ్రేణులు, ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. మున్సిపల్ ఎన్నికల ముంగిట కావాలనే కుట్రపూరితంగా ఈ విచారణలు సాగిస్తున్నారని, రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ రాజకీయ కక్షసాధింపు అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

కేటీఆర్, హరీష్ రావు వాంగ్మూలాల ఆధారంగా విచారణ

సిట్ అధికారులు ఇప్పటికే ఈ కేసులో కీలకమైన సమాచారాన్ని సేకరించారు. గత కొన్ని రోజులుగా కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు, వారి నుంచి సేకరించిన వాంగ్మూలాలు, గతంలో ఐదుగురు పోలీస్ అధికారులు ఇచ్చిన వాగ్మూలాల ఆధారంగా కేసీఆర్ కోసం ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేశారు. అసలు ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఇంటెలిజెన్స్ సమాచారం ఎవరెవరికి చేరింది అనే అంశాలపై అధికారుల ప్రశ్నలు ప్రధానంగా ఉండనున్నాయి. 65 ఏళ్లు పైబడిన వ్యక్తి కాబట్టి ఆయన నివాసంలోనే విచారించేందుకు అధికారులు 160 సీఆర్ పీసీ కింద నోటీసులు జారీ చేశారు.

పోలీసుల భారీ బందోబస్తు

ఈ హై-ప్రొఫైల్ విచారణ , బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపునివ్వడంతో నందినగర్ చుట్టూ భద్రతా వలయాన్ని పోలీసులు ఏర్పాటు చేయనున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో, శాంతిభద్రతల దృష్ట్యా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి నందినగర్ వెళ్లే దారులన్నీ పోలీసుల ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఆదివారం జరగబోయే ఈ విచారణ ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.