Mahaa Daily Exclusive

  కరీంనగర్ క్లీన్ స్వీప్ దిశగా బీజేపీ: మేయర్, 3 మున్సిపల్ పీఠాలు మనవే – బండి సంజయ్ ధీమా!

Share

  • కరీంనగర్ మేయర్, 3 ఛైర్మన్ పీఠాలు బీజేపీవే
  • తప్పుడు ప్రచారాలు నమ్మకండి
  • డివిజన్లలో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీని గెలించండి
  • కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్ ఇంఛార్జీలు, కన్వీనర్లు, కో కన్వీనర్ల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, మహా : కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంతోపాటు 3 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ స్థానాలను బీజేపీ విజయం కైవసం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సర్వేల్లో వెల్లడైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకే టిక్కెట్ల విషయంలో అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ లో 80 శాతంపైగా టిక్కెట్లు వారికే ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గెలిచే అవకాశం లేని మిగిలిన స్థానాల్లో మాత్రమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆయా చోట్ల టిక్కెట్లు రాని బీజేపీ కార్యకర్తలు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. నామినేటెడ్ పోస్టులతోపాటు పార్టీ పదవులిచ్చి వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తొందరపడి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్ ఇంఛార్జీలు, కన్వీనర్లు, కో కన్వీనర్ల సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తోపాటు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతామూర్తి, పార్టీ సీనియర్ నేతలు సాయిని మల్లేశం, గుజ్జ శ్రీను, ఇనుగొండ నాగేశ్వరరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్ లో జరిగిన అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధుల వల్లనే అని స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి ఆగకూడదంటే బీజేపీకి ఓటేసి ఆశీర్వదించాలని కోరుతూ ఇంటింటికీ ప్రచారం చేయాలని కోరారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తానని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండాను ఎగరేసే బాధ్యత కార్యకర్తలదేనన్నారు. టిక్కెట్ ఆశించి భంగపడిన కార్యకర్తలను సముదాయించి డివిజన్ లో బీజేపీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేసేలా చూడాలని కోరారు.