- ఇది వికసిత భారత్ బడ్జెట్
- ఇది అభివృద్ధి బడ్జెట్
- ఇది ప్రజారంజక బడ్జెట్
ఉపాధికి, చేతివృత్తులకు, ఆరోగ్యానికి పెద్దపీట వేశారు
- కేంద్ర బడ్జెట్ పై ఎంపీ ఈటల రాజేందర్
న్యూఢిల్లీ, మహా : నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశంలో సుస్థిరమైన ప్రభుత్వ నడుస్తుందని, దూరదృష్టతో దీర్ఘకాలిక నిర్ణయాల వల్ల దేశ జీడీపీ ఏడు శాతం పెరిగిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఈటల గత ఏడాది50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే ఈ సంవత్సరం 53 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు ఈ బడ్జెట్ లో అనేక ప్రజారంజక విషయాల మీద దృష్టి పెట్టారని, గంభీరంగా ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి గత బడ్జెట్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టగా, ఈసారి కూడా పెట్టారన్నారు. మేకిన్ ఇండియా మేడిన్ ఇండియా అనుగుణంగా యువశక్తి దేశ పురోగమనములో భాగస్వాములు చేయాలని లక్ష్యంతో బడ్జెట్ పెట్టారని పేర్కొన్నారు. అనేక మందుల మీద ఇంపోర్ట్ టాక్స్ తగ్గించడం జరిగిందని, క్యాన్సర్ తో పాటు 17 రకాల మందుల మీద పన్ను రాయితీ ఇచ్చి పేద రోగులకు ఉపశమనం కల్పించారన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ట్రామా కేర్ సెంటర్ పెట్టాలని నిర్ణయించడం జరిగిందని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకానికి పేరు మారిస్తే ఆ పథకమే తీసేస్తున్నట్లుగా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయి కానీ గత బడ్జెట్ లో 81 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే ఈసారి లక్షా యాభైవేల కోట్ల రూపాయల పై చిలుకు ఈ బడ్జెట్ పెట్టామన్నారు. గ్రామీణ పేదలకు మరింత ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. దేశ భవిష్యత్తు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఆధారపడి ఉంటుందని, గత ఏడాది 11 లక్షల కోట్ల రూపాయలు పెడితే ఈసారి 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టడం జరిగిందన్నారు. ఈ బడ్జెట్ లో ఎక్కువ మాన్ పవర్ కోసం నిధులు కేటాయించడం జరిగిందని, లక్షలాదిమంది ఆధారపడి ఉన్న చేనేత రంగానికి ప్రోత్సాహం ఇచ్చామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డైరీ పౌల్ట్రీ వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు పెద్దపీట వేసింది అనడానికి బడ్జెట్ సజీవ సాక్ష్యమన్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతులు తగ్గించి స్వదేశీ ఉత్పత్తులు పెంచడం కోసం అనేక పథకాలను ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టారని, వికసిత భారత్ 2047 వైపు ప్రయాణించడానికి ఈ బడ్జెట్ స్పష్టమైన మార్గ నిర్దేశం చేసిందని పేర్కొన్నారు. కోట్ల మంది ఆధారపడి ఉన్న సర్వీస్ సెక్టార్ మీద మొట్టమొదటిసారిగా దృష్టి పెట్టి దానిని ప్రోత్సహించే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేసిందని, ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ రాష్ట్రాలకు మినరల్ హబ్ గా తయారు చేయడం కోసం ప్రత్యేక కారిడార్ ప్రకటించారన్నారు.
గౌతమ బుద్ధుడు నడయాడిన నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో టూరిజం డెవలప్ మెంట్ చేయడానికి ప్రణాళికలను ఈ బడ్జెట్ ఇచ్చిందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగం నుంచి అప్పులు ఎక్కువగా ఇచ్చేందుకు ఏం చేయాలి అనే దానిమీద చాలా సునిశితమైన దృష్టితో ఈ బడ్జెట్ ప్రతిపాదన జరిగిందని చెప్పారు.







