హైదరాబాద్, మహా : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించిన పైరసీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐబొమ్మ రవి (ఇమంది రవి) బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఐబొమ్మ రవి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను మంగళవారం విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు శుక్రవారం వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. సైబర్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో నమోదైన నాలుగు కేసుల్లో బెయిల్ కోరుతూ ఐబొమ్మ రవి ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్‌ను మంగళవారం విచారించిన హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. అరెస్ట్ అయినప్పటి నుంచి ఐబొమ్మ రవి చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఇప్పటికే నాంపల్లి కోర్టులో పలుమార్లు పిటిషన్ వేసిన ఐబొమ్మ రవికి షాక్ తగిలింది. ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేయడంతో అతడు ఏకంగా హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులు కౌంటర్ దాఖలు చేయగా.. దానిపై విచారణ జరిపి శుక్రవారం రోజుకు వాయిదా వేసింది.
దేశ, విదేశాల్లో ఏజెంట్లను, సర్వర్లను ఏర్పాటు చేసుకున్న ఐబొమ్మ రవి ఏకంగా పైరసీ సామ్రాజ్యాన్నే నిర్మించినట్లు ఇప్పటివరకు పోలీసులు జరిపిన విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా ఐబొమ్మ వెబ్‌సైట్ వేదికగా తనను పట్టుకోలేరంటూ పోలీసులనే హేళన చేయడం వారికి పెద్ద సవాల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. వల వేసి పట్టుకున్నారు. ఈ-మెయిల్ ఆధారంగా ఐబొమ్మ రవిపై నిఘా పెట్టిన పోలీసులు.. అతడు హైదరాబాద్‌కు వచ్చినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో మాత్రం ఐబొమ్మ రవి.. నోరు విప్పడం లేదని తెలుస్తోంది. ఏ ప్రశ్నలు అడిగినా అతడు సరిగ్గా సమాధానాలు ఇవ్వడం లేదని సమాచారం. విదేశాల్లో ఉన్న డేటా గురించి అడిగిన ప్రశ్నలకు అతడు సమాధానాలు దాటవేస్తున్నట్లు తెలుస్తోంది.








