Mahaa Daily Exclusive

  ఫేక్ లెక్చరర్ల ఆటకట్టుకు …ఇంటర్ బోర్డు ఐడీ కార్డులు….

Share

  • ఫేక్ లెక్చరర్ల ఆటకట్టుకు
  • ఇంటర్ బోర్డు ఐడీ కార్డులు
  • ఐడీతో లెక్చరర్ల సర్వీస్ హిస్టరీని ఈజీగా ట్రాక్ చేసే అవకాశం

ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో అక్రమాలను అరికట్టడానికి, ఫేక్ లెక్చరర్లను తగ్గించడానికి తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. లెక్చరర్లకు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య(యూనిక్ ఐడీ) వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఒక లెక్చరర్ ఏ కాలేజీకి వెళ్లినా ఒకటే శాశ్వత ఐడీ ఉంటుంది. ఇదే ఎక్కడకు వెళ్లినా వారి వివరాలను చెబుతుందన్నమాట. కొత్త వ్యవస్థ కింద ప్రతి లెక్చరర్‌కు ఒకే శాశ్వత ప్రత్యేక ఐడీని కేటాయిస్తారు. ఒక లెక్చరర్ ఒక కళాశాల నుండి మరొక కళాశాలకు మారినప్పటికీ అదే ఐడీ కొనసాగుతుంది. ఆధార్ కార్డు ఎలానో.. ఈ ఐడీ కూడా లెక్చరర్లు ఉద్యోగం చేయడానికి ఉపయోగపడనుంది. దీని వలన ఇంటర్ బోర్డు.. లెక్చరర్ పూర్తి సర్వీస్ హిస్టరీని ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది. రికార్డులను తారుమారు చేయడం ద్వారా రెండు లేదా మూడు కళాశాలల్లో ఒకేసారి పనిచేస్తున్నారు కొంతమంది లెక్చరర్లు. అలాంటి వారిని యూనిక్ ఐడీ ద్వారా ఈజీగా గుర్తించవచ్చని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఈ ప్రత్యేక ఐడీలు కీలక పాత్ర పోషిస్తాయి.

రాష్ట్రవ్యాప్తంగా 41 వేల మందికిపైగా బోధనా సిబ్బందికి బోర్డు ఇప్పటికే ప్రత్యేక ఐడీ నెంబర్లు కేటాయించింది. ఈ వ్యవస్థ నకిలీ అధ్యాపకులను గుర్తించడంలో, ఫేక్ వ్యక్తులను నిరోధించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఒక ఐడీని ఒకేసారి ఒక కళాశాలకు మాత్రమే లింక్ చేయవచ్చు. కార్పొరేట్ కళాశాలల్లోని అనేక మంది లెక్చరర్లు ఒకేసారి పలు కాలేజీల్లో పని చేస్తుంటారు. ఈ విషయం బోర్డు దృష్టికి వచ్చింది. ప్రధానంగా భాష లెక్చరర్లు, గణితం, భౌతిక శాస్త్రం వంటి అధిక డిమాండ్ ఉన్న సబ్జెక్టుల బోధించేవారు ఒకేసారి పలు కాలేజీల్లో బోధిస్తున్నారు. చాలా సందర్భాలలో ఒకే లెక్చరర్‌ను వేర్వేరు వ్యక్తులలాగా చూపించడానికి పేర్లలో చిన్న మార్పులు చేస్తుంటారు.

బోర్డ్ నిబంధనల ప్రకారం, అదనపు విభాగాలకు అదనపు లెక్చరర్లు అవసరమైతే యాజమాన్యాలు ఇప్పటికే ఉన్న సిబ్బందితో అదనపు విభాగాలను నడుపుతున్నాయి. తరగతులతో వారిపై భారం మోపుతున్నాయి. ప్రత్యేక ఐడీ వ్యవస్థతో కళాశాలలు ఇప్పుడు అవసరమైన చోట కొత్త సిబ్బందిని నియమించుకోవలసి వస్తుంది. ఇంటర్మీడియట్ విద్యలో పారదర్శకతను పెంపొందించడానికి ఈ యూనిక్ ఐడీ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఇంటర్ బోర్డు. నిబంధనల ప్రకారం కళాశాలలకు ఎంతమంది అవసరమో.. అంతమంది అధ్యాపకులు ఉన్నారో లేదో ధృవీకరించడం ఈ వ్యవస్థ సులభతరం చేస్తుంది.