- సంపదను సృష్టించే మేధస్సు మనవద్ద ఉంది
- అందుకే ప్రపంచ దేశాలు మనవైపు చూస్తున్నాయి
- ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే అనర్థం
- మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- తుమ్మల కిశోర్ రాసిన ‘సంపద సృష్టికి శతకోటి మార్గాలు’ పుస్తకావిష్కరణ
హైదరాబాద్, మహా : పిల్లలకు చిన్ననాటి నుంచే పొదుపు నేర్పించాల్సిన అవసరం ఉందని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయడు సూచించారు. బ్యాంకింగ్ రంగ నిపుణుడు, రచయిత తుమ్మల కిశోర్ రాసిన ‘సంపద సృష్టికి శతకోటి మార్గాలు’ పుస్తకాన్ని బుధవారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ‘‘నేటి సమాజంలో కొనుగోలు తత్వం బాగా పెరిగింది. నేడు మార్కెట్లోకి వెళ్తే ప్రతిదీ కొనేయాలి అనిపించేలా ప్రకటనలు ఊరిస్తున్నాయి. వ్యాపార ప్రకటనలకు ఆకర్షితులై అవసరం ఉన్నా, లేకున్నా కొంటున్నారు. ఈ ‘మితిమీరిన కొనుగోలు తత్వం’ ఒక వ్యసనంలా మారుతోంది. అవసరం, సౌకర్యం, విలాసం మధ్య ఉన్న తేడాను గుర్తించి కొనుగోలు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రూపాయి అనవసరపు ఖర్చును ఆపితే, ఒక రూపాయిని సంపాదించినట్టే లెక్క. ’’ అని స్పష్టం చేశారు. ‘‘భారతీయ సమాజంలోనే, మన జీవన విధానంలోనే పొదుపు స్వభావం ఇమిడి ఉంది. సంపదను సృష్టించే మేధస్సు మన దేశంలో ఉంది. అందుకు ప్రపంచం మొత్తం మనవైపు చూస్తోంది. ఐరోపా సమాఖ్య మనతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ వెంటనే అమెరికా కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆర్థిక మేధస్సు సమాజంలో కింద వరకు వెళ్లాలి. ఒకప్పుడు అవసరాలకు పోనూ మిగిలిన మొత్తంతో భూములు కొనేవారు. మహిళలు తాము పొదుపు చేసిన మొత్తం తో బంగారం కొనేవారు. ఇప్పుడు అమెరికా వంటి పాశ్చాత్య దేశాల ప్రభావంతో విచ్చలవిడి కొనుగోలు తత్వం పెరిగింది. పిల్లలకు పొదుపు తెలియడం లేదు. గతంలో కిడ్డీ బ్యాంకులుండేవి. పిల్లలకు పొదుపు చేయడంలో ప్రేరణగా ఉండేవి. పిల్లలకు వాటిల్లో డబ్బు దాచడం నేర్పించేవారు. అది ఆర్థిక క్రమశిక్షణకు తొలిమెట్టుగా ఉండేది. ఇప్పుడు కిడ్డీ బ్యాంకులు తెలియడం లేదు. వారికి తెలిసిందల్లా ఏటీఎం లలో మీట నొక్కితే డబ్బు వస్తుందనే. ఆ డబ్బు రావడానికి ఎంత శ్రమపడాలి అనేది వారికి తెలియడం లేదు. వారికి నేర్పించాల్సిన బాధ్యత పెద్దలదే. పిల్లలకు చిన్ననాటి నుంచే సన్మార్గం వైపు నడవడం నేర్పించడంతో పాటు పొదుపు, ఆర్థిక క్రమశిక్షణ కూడా నేర్పించాలి.’’ అని సూచించారు.
‘‘ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఈజ్ మోర్ దాన్ అమ్యునిషన్. సమాచారం అత్యంత కచ్చితత్వంతో ఉంటేనే ప్రజలకు ఉపయోగపడుతుంది. కిశోర్ రాసిన ఈ పుస్తకంలో సంపద సృష్టికి ఉన్న మార్గాలు, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు, పొదుపునకు ఉన్న అవకాశాలు, కేంద్ర ప్రభుత్వం, వివిధ బ్యాంకులు అందిస్తున్న వివిధ పథకాల గురించి వివరంగా ఉన్నాయి. ఒక సగటు కుటుంబం ఆర్థికంగా సౌకర్యవంతంగా తమ జీవితాన్ని మలుచుకోవడానికి అందుబాటులో ఉన్న అవకాశాలు అన్నిటి గురించి ఒకే చోట గుదిగుచ్చి ఇవ్వటం చాలా మంచి ప్రయత్నం’’ అని వెంకయ్యనాయుడు చెప్పారు.







