- కొరియన్ గేమ్‌కు బానిసై ముగ్గురు బాలికల ఆత్మహత్య
- సారీ పాపా అని సూసైడ్ నోట్
- తొమ్మిదవ అంతస్తు నుంచి బలవన్మరం
- యూపీలోని ఘజియాబాద్ లో ఘటన
ఘజియాబాద్, మహా : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాదానికి కొరియా ఆన్లైన్ గేమింగ్ వ్యసనమే కారణం. ముగ్గురు మైనర్ బాలికలు రాసిన ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ ఈ కేసులో కీలకంగా మారింది. కొరియా ఆన్లైన్ గేమింగ్ ఆడటంపై తమ తల్లిదండ్రులు అభ్యంతర పెట్టడంతో 12, 14, 16 ఏళ్ల వయసున్న మైనర్ బాలికలు తమ అపార్ట్ మెంట్ తొమ్మిదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఒకేసారి ముగ్గురు కూతుళ్లు సూసైడ్ చేసుకోవడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం.
పోలీసుల కథనం ప్రకారం.. ఆ ముగ్గురు బాలికలు ఒక పాకెట్ డైరీలో హిందీ, ఇంగ్లీష్ ను కలిపి చనిపోయే ముందు ఒక లేఖను రాశారు. అందులో తమ తల్లిదండ్రులకు పదేపదే క్షమాపణలు కోరారు. డైరీ మొత్తం చదవాలని కోరారు. “ఈ డైరీలో రాసినవన్నీ చదవండి, ఎందుకంటే మేం రాసినదంతా నిజం. ఇప్పుడే చదవండి! మమ్మల్ని క్షమించండి నాన్న” అని రాసి, చివర్లో ఏడుస్తున్నట్లుగా ఎమోజీని ఉంచారు. వారి గదిలో గోడపై “చాలా ఒంటరిగా ఉన్నాం” అని రాసి ఉన్న మెస్సేజ్ పోలీసులను కలచివేసింది.
తొమ్మిదో అంతస్తు నుండి ఒక్కొక్కరుగా దూకేశారు..
ఘజియాబాద్‌లోని భారత్ సిటీలో నివసించే చేతన్ కుమార్ కుమార్తెలు పాఖీ (12), ప్రాచి (14), విశిక (16). తెల్లవారుజామున 2 గంటల సమయంలో తమ గదికి లోపల నుండి గడియ పెట్టుకుని, కిటికీ నుండి ఒకరి తర్వాత ఒకరు కిందకు దూకేసి ఆత్మహత్య చేసుకున్నారు. ఏదో కింద పడ్డ శబ్దం విన్న సెక్యూరిటీ సిబ్బంది, స్థానికులు అక్కడికి చేరుకునేలోపే వారు ముగ్గురు తీవ్ర రక్తస్రావమై చనిపోయారు. కుటుంబ సభ్యులు రూమ్ తలుపులు పగలగొట్టి చూసేసరికి ముగ్గురూ కిందకు దూకేసి పడిపోయి ఉన్నారు.
ఆన్లైన్ గేమే ప్రాణాలు తీసిందా?
కోవిడ్ 19 సమయంలో మొదలైన ఒక కొరియన్ టాస్క్ బేస్డ్ గేమ్‌కు ఈ బాలికలు బానిసలైనట్లు విచారణలో తేలింది. వారు ఎంతలా ప్రభావితమయ్యారంటే, తమ పేర్లను కూడా కొరియన్ పేర్లుగా మార్చుకున్నారు. “మేము కొరియాను వదలి ఉండలేం. కొరియానే మా జీవితం. మీరు మమ్మల్ని కొరియా నుంచి దూరం చేయలేరు. అందుకే ప్రాణాలు తీసుకుంటున్నాం” అని ఆ డైరీలో రాసుకొచ్చారు. రెండో కూతురు ప్రాచీ మిగిలిన ఇద్దరిని ఈ గేమ్ వైపు నడిపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తండ్రి ఆవేదన.. కొనసాగుతున్న విచారణ
తన పిల్లలు ఆడుతున్న గేమ్ గురించి తనకు తెలియదని తండ్రి చేతన్ కుమార్ కన్నీరుమున్నీరయ్యారు. మరో బిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకూడదు. పిల్లలను వీడియో గేమ్స్‌కు దూరంగా ఉంచాలని అందరు తల్లిదండ్రులందరినీ కోరుతున్నాను అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు, చదువులో వెనుకబడటం వల్ల ఈ పిల్లలు స్కూలుకు వెళ్లడం లేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం డిజిటల్ ఆధారాలను, డైరీలోని అంశాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఇటీవల బాలికలను మొబైల్ ఫోన్ వాడవద్దని తల్లిదండ్రులు మందలించారు. వారికి ఫోన్ ఇవ్వకపోవడంతో తాము ముగ్గురు కలిసి ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్నట్లు అక్కాచెల్లెళ్లు భావించారు. కొరియా ఆన్‌లైన్ గేమ్‌కు బానిసైన వారికి ఫోన్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనై.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిమిష్ పాటిల్ తెలిపారు.






