Mahaa Daily Exclusive

  నిందితులను రోడ్లపై నడిపించటంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

Share

  • నిందితులను రోడ్లపై నడిపించటంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
  • విచారణ 4 వారాలకు వాయిదా
  • తెనాలిలో జరిగిన ఘటన

అమరావతి, మహా : హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పోలీసులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిందితులను నడిరోడ్డుపై నడిపించడం, వారిని అవహేళనకు గురిచేయడం వంటి చర్యలపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదైన వెంటనే నిందితుల ఆత్మాభిమానం దెబ్బతినేలా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ అండ్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంటల్ రైట్స్ విజయవాడ జిల్లా అధ్యక్షుడు పరసా సురేష్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.

పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తెనాలిలో యువకులను బహిరంగంగా కొట్టడం, ఇతర ప్రాంతాల్లో నిందితులను ఊరేగించడం వంటి ఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆయన కోర్టుకు సమర్పించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తమ్మలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల (వాహనం బ్రేక్ డౌన్ అవ్వడం వంటివి) నిందితులు రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, ఇవి విడిగా జరిగిన ఘటనలు కాదని, రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం జరుగుతున్న చట్టవిరుద్ధ చర్యలని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వాదనలతో ఏకీభవించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్ లతో కూడిన ధర్మాసనం పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పోలీసులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకూడదని, ప్రజలతో మర్యాదగా ఉండాలని హితవు పలికింది. ప్రభుత్వం మెప్పు పొందేందుకు నిందితుల ప్రాథమిక హక్కులను కాలరాయవద్దని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు గుంటూరు, కృష్ణా జిల్లాల ఎస్పీలు వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

నిందితులను రోడ్లపై నడిపించిన పోలీసులు

తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యడ్ల లింగయ్య కాలనీ శివారు టీచర్స్ కాలనీలో జనవరి 9వ తేదీన జరిగిన ఏసీ మెకానిక్ షేక్.ఫయాజ్ అహ్మద్ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య ఘటన సీన్ రీ కన్స్ట్రక్షన్ లో భాగంగా పోలీసులు నిందితులను చెంచుపేటలో తెనాలి – గుంటూరు రాష్ట్ర రహదారిపై నడిపించారు. హత్య కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించగా, వారిలో నలుగురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచామని సీఐ సాంబశివరావు తెలిపారు.