Mahaa Daily Exclusive

  పాలమూరు ‘విజయ సంకల్ప్’ సభలో కాంగ్రెస్‌పై బీజేపీ విసుర్లు: సనాతన ధర్మంపై దాడులు సహించం.. ‘ఆర్ఆర్ ట్యాక్స్’తో అభివృద్ధి కుంటుపడింది!

Share

  • సనాతన ధర్మంపై జరిగే దాడులను సహించం
  • ముస్లిం ఓటు బ్యాంకుకు కాంగ్రెస్ ఆరాట పడుతోంది
  • హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు
  • బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం
  • విజయ్ సంకల్ప్ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్

మహబూబ్ నగర్, మహా : రాష్ట్రంలో సనాతన ధర్మం మీద జరిగే దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హెచ్చరించారు. మహబూబ్ నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ‘విజయ సంకల్ప్’ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటపడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా నోరు మెదపడం లేదని, ఆలయాల భూములు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. ముస్లిం సంతుష్టీకరణ విధానాలతో ఓటు బ్యాంక్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని దుయ్యబట్టారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎందరో పోరాడారని, హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారన్నారు. వక్ఫ్ బోర్డును బలోపేతం చేసేందుకు చూస్తోందని, ఇదే సమయంలో హిందూ దేవాలయాలు, సనాతన ధర్మంపై కక్షకట్టి వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బలహీనవర్గాలకు న్యాయం జరగలేదని, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో ప్రభుత్వం కోత విధిస్తోందని ఆరోపించారు.

ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, మహిళలకు స్కూటీలు, మహిళలకు రూ. 2500 నగదు జమ, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదని అన్నారు. ఎస్సీలు, ఆదివాసీలు, బీసీలను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు, బిల్లుల మంజూరుకు ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లించవలసి వస్తోందని అన్నారు. అవినీతి, కమీషన్ల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తోందని, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుంటే తెలంగాణలో అవినీతి దూసుకు పోతుందన్నారు. తెలంగాణలో రైల్వే పనులకు రూ.5,400 కోట్లకు పైగా కేటాయించామని, మూడు హైస్పీడ్ రైల్ రైళ్లను ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి కేంద్రం ఇతోధికంగా నిధులు ఇస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం పట్ల ఆదరణ పెరుగుతోందని అన్నారు. ఈయూతో ఒప్పందం చేసుకుని దేశాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజలకు సమన్యాయం చేస్తున్నారన్నారు.

పాలమూరు గడ్డ… బిజెపి అడ్డా : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ప్రస్తుత ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ జిల్లా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పాలమూరు బిడ్డలు బీజేపీని ఎప్పుడూ ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారని, మునిసిపల్ ఎన్నికల్లోనూ ఆదే తరహా ఆదరించి ఆశీర్వదించాలన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా రెండేళ్ళు పూర్తి చేసుకున్నా జిల్లాకు, రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదని విరుచుకుపడ్డారు. రేవంత్ మాటలు కోటలు దాటుతాయి కానీ పనులు పాలమూరు జిల్లాకు రావడం లేదన్నారు. కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడిందని, తనను సీఎం చేస్తే అవినీతికి పాల్పడిన కేసీఆర్ ప్రభుత్వంలోని దోషులను చర్లపల్లి జైలుకు పంపిస్తానని చెప్పిన రేవంత్ ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కు- రాహుల్ గాంధీకి ఒప్పందాలు కుదిరాయి కాబట్టే రేవంత్ ప్రభుత్వంపై వీళ్లపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ దొందూ దొందేనని, మా ప్రభుత్వం కొట్టినట్లు చేస్తుంది, మీరు ఏడ్చినట్లు చేయండి అనేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ భయానకంగా జరిగింది. భార్యభర్తలు మాట్లాడుకున్న విషయాలను కూడా కేసీఆర్ ప్రభుత్వంలో టాప్ చేసి విన్నారు. సినీ హీరోయిన్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు మాట్లాడిన మాటలు కూడా ఫోన్ ట్యాపింగ్‌లో గమనించారు. విలేకరులు, మీడియా మేనేజ్‌మెంట్ ఫోన్లను కూడా టాప్ చేసారు. చివరికి తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఫోన్లలో సంభాషించిన మాటలను విన్నారు. పోలీసులతో పాటు బిజెపి నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి వారి మాటలు విన్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సీరియల్‌గా సాగదీయడం తప్ప, అసలు దోషులైన నాయకులపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే, అవినీతిరహిత పాలన రావాలంటే, నీతి, నిజాయితీతో సమర్థ పాలన రావాలంటే… నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, నితిన్ నబిన్ గారి నాయకత్వంలో తెలంగాణలో బిజెపి జెండా ఎగురాలన్నారు. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఒక అడుగు వేసి 8 ఎంపీ సీట్లలో బిజెపిని గెలిపించారని, ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరో అడుగు ముందుకేసి బిజెపి గెలిపించాలని కోరారు. తెలంగాణలో అవినీతి, అక్రమాల, మాటల ప్రభుత్వానికి వ్యతిరేకంగా మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను ఆశీర్వదించి మెజారిటీ చైర్మన్లను బిజెపి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.