Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌లో ఆల్‌ ఇండియా పోలీస్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌: మార్చి 23 నుంచి మెగా టోర్నీ.. ఏర్పాట్లను సమీక్షించిన డీజీపీ

Share

  • మార్చ్ 23 నుంచి హైదరాబాద్ లో
  • ఆల్ ఇండియా పోలీస్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్ షిప్ పోటీలు
  • సమీక్షించిన డీజీపీ

హైదరాబాద్‌, మహా : తెలంగాణ పోలీస్ శాఖ ఆతిథ్యమివ్వనున్న ‘74వ బి.ఎన్‌. మల్లిక్‌ మెమోరియల్ ఆలిండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ నిర్వహణపై డిజిపి బి. శివధర్ రెడ్డి గురువారం సంబంధిత పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలను తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న నేపథ్యంలో పోటీల నిర్వహణపై జరుగుతున్న ఏర్పాట్లను ఈ సందర్భంగా పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డిజిపి మాట్లాడుతూ…..వచ్చే నెల మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 వరకు హైదరాబాద్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుందని , దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర భద్రతా బలగాల నుంచి 53 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. సుమారు 2100 మంది క్రీడాకారులు, అధికారులు భాగస్వాములు కాబోతున్నారని తెలియజేశారు. మార్చి 23న జట్లన్నీ నగరానికి చేరుకుంటాయని, మార్చి 25న మధ్యాహ్నం 3 గంటలకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రారంభ వేడుకలు నిర్వహిస్తామని డిజిపి అన్నారు. ఈ పోటీల నిర్వహణ కోసం నగరం చుట్టుపక్క మైదానాలను తనిఖీ చేశామని, మైదానాలను కొన్ని మ్యాచ్‌ల కోసం, మిగిలిన మైదానాలను ప్రాక్టీస్ కోసం కేటాయించినట్లు పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియం, తెలంగాణ పోలీస్ అకాడమీలలోని వంటి మైదానాలలో ఈ పోటీలు జరగనున్నాయని తెలిపారు.
పోటీల నిర్వహణ కోసం వివిధ కమిటీలు పనిచేస్తున్నాయని, క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వసతి, రవాణా సౌకర్యాలను పకడ్బందీగా ఏర్పాటు చేశామని డిజిపి పేర్కొన్నారు.ఏప్రిల్ 5న ఫైనల్ మ్యాచ్ అనంతరం ముగింపు వేడుకలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఫుట్ బాల్ క్రీడాకారులతో ఎగ్జిబిషన్ మ్యాచ్ ను నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. గత సంవత్సరం 73 వ బి.ఎన్ మల్లిక్ ఆల్ ఇండియా పోటీలను నిర్వహించిన త్రిపుర రాష్ట్రానికి వెళ్లి వచ్చిన పోలీస్ అధికారులతో సంబంధిత వివరాలను డిజిపి అడిగి తెలుసుకున్నారు ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే జట్లు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటాయని, దేశవ్యాప్త పోలీస్ బలగాల మధ్య క్రీడా స్ఫూర్తిని, ఐక్యతను పెంపొందించేలా ఈ పోటీలను పకడ్బందీగా నిర్వహించాలని డిజిపి సంబంధిత పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు. ఆర్ బి వి ఆర్ ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, సైబరాబాద్ సిపి ఎం. రమేష్, హైదరాబాద్ అడిషనల్ సిపి తఫ్సీర్ ఇక్బాల్, ఐ జి పి , స్పోర్ట్స్ గజరావు భూపాల్ తదితరులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.