Mahaa Daily Exclusive

  బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం’: చొప్పదండి సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

Share

  • బీఆర్ఎస్ నేతల నుంచి బీజేపీ నేతలకు లంచాలు
  • అందుకే ఆరు నెలలైనా కాళేశ్వరంపై చర్యలు లేవు
  • రాష్ట్ర సంపదను దోచుకున్న వారిని వదిలేదని స్పష్టం
  • బీజేపీకి దమ్ముంటే మునిసిపల్ ఎన్నికలు ముగిసేలోగా కేసీఆర్ ను అరెస్ట్ చేయాలి
  • చొప్పదండి సభలో సీఎం రేవంత్ రెడ్డి విశ్వరూపం

కరీంనగర్, మహా : బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పరోక్షంగా ఒక్కటయ్యాయని, ఆ రెండు పార్టీల మధ్య అపవిత్ర కలయిక ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతి అక్రమాల నుంచి వారిని కాపాడేందుకు బీజేపీ నేతలు భారీగా లంచాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో రేవంత్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి, పరస్పర ప్రయోజనాల కోసం ఈ రెండు పార్టీలు పని చేస్తున్నాయని, అందుకే బీఆర్ఎస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక అంశాలను ప్రస్తావిస్తూ బీజేపీ నేతలు ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు తమ అక్రమ సంపాదనను బీజేపీ నేతలకు చేరవేస్తున్నారని, దానికి ప్రతిఫలంగా బీజేపీ ప్రభుత్వం వారిపై ఎలాంటి విచారణ జరగకుండా అడ్డుకుంటుందని ఆయన విశ్లేషించారు. రాష్ట్ర సంపదను దోచుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రజల సొమ్మును కక్కిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. కాళేశ్వరం రిపోర్టు పంపి ఆరు నెలలు అయినా చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. మున్సిపల్ ఎన్నికలు రాగానే జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చి ప్రచారం చేయిస్తున్నారు. బడ్జెట్‌లో గాడిద గుడ్డు ఇచ్చాం.. తెలంగాణ ప్రజలు మనకు ఓట్లు వేయరు అని ఆ అధ్యక్షుడికైనా తెలియాలి కదా అని అన్నారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు కాళేశ్వరం స్కామ్‌‌లో, ఫార్ములా ఈకార్ రేస్ కేసులో కేసీఆర్‌, కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అక్రమాల గురించి స్వయంగా ప్రధాని మోడీనే నిలదీసి ఇంకా ఎందుకు జైల్లో వేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిని ఒకరు ప్రొటెక్ట్ చేసుకుంటూ రాజకీయాల్లో కొనసాగుతున్నారని అన్నారు. ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ బంధం నిజం కాకపోతే మున్సిపల్ ఎన్నికలు ముగిసేలోపు కేసీఆర్‌, కేటీఆర్, హరీష్ రావును అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. బీజేపీ ఎంపీలు, నేతలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యారని, తెలంగాణకు రావాల్సిన నిధులు, హక్కుల గురించి కేంద్రం వద్ద నోరు మెదపడం లేదని సీఎం విమర్శించారు. బీఆర్ఎస్‌తో ఉన్న లోపాయికారి ఒప్పందం వల్లే బీజేపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాల కంటే వారి రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని, కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకమైన పాలన అందిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను కూడా రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. అక్షింతలు వేసే వారు ఒకవైపు, అభివృద్ధి చేసే వారు మరొకవైపు ఉన్నారని.. ప్రజలు ఎవరిని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలని సూచించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ఆ అప్పులను తీర్చుకుంటూనే తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన వివరించారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరూ సమ్మక్క జాతరకు హాజరు కాలేదన్నారు. గతంలో భద్రాచలం విషయంలోనూ అలాగే చేశారన్నారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నిలువునా దోచుకుందన్నారు. నిరుద్యోగులు, మహిళలు, రైతులు అందరినీ ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ప్రజలు ఛీ కొట్టిన తర్వాత.. బుద్ధి తెచ్చుకుని పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం పని చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ సర్వం త్యాగం చేసి.. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించారన్నారు. ఆడబిడ్డలకు ఇచ్చే బతుకమ్మ చీరల వ్యవహారంలోనూ బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో భార్యా, భర్తలు మాట్లాడుకునే ఫోన్లు కూడా విన్నారని, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సినిమా తారలు ఎవరి ఫోన్లూ వదల్లేదని మండిపడ్డారు. మంది ఫోన్లు వినే వాడు మనిషేనా? అలాంటి మనుషులకు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేస్తే.. మన కళ్లలో మన వేలుతో పొడుసుకున్నట్లు ఉంటుందన్నారు.

నన్ను కలవాలంటే… నో అపాయింట్మెంట్

పదేళ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్, పన్నెండు ఏళ్లలో దేశానికి బీజేపీకి చేసిన దానికంటే.. తాము రెండున్నరేళ్లలో ఎక్కువే చేశామన్నారు. 70 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. ఇందులో ఎవరికైనా అనుమానం ఉంటే.. ఎల్బీ స్టేడియానికి రావాలని.. అక్కడే వివరంగా చెబుతా అని సవాల్ చేశారు. సన్నబియ్యం ఇస్తున్నాం, విద్యార్థులకు కాస్కొటిక్ ఛార్జీలు పెంచినం, బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌లు తీసుకొచ్చినం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నం, రైతులకు ఉచిత కరెంట్, రైతు బీమా, రైతు భరోసా, రైతు రుణమాఫీ, వరికి రూ.500 బోనస్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు ఇలా చెప్పుకుంటూపోతే అనేక పనులు రెండున్నరేళ్లలోనే చేసి చూపించామని అన్నారు.

డబ్బులతో కాదు నమ్మకంతో గెలుస్తాం : అభ్యర్థులతో రేవంత్

రాజకీయాల్లో డబ్బులతో కాదు.. నమ్మకంతోనే గెలుస్తామని మున్సిపల్ ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి సూచించారు. ‘ప్రజలకు నమ్మకం కలిగించండి.. అదొక్కటే మిమ్మల్ని గెలిపిస్తుంది’ అని వారికి స్పష్టం చేశారు. చొప్పదండి పర్యటనలో భాగంగా మునిసిపల్ అభ్యర్థులతో భేటీ అయిన సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇవి కార్యకర్తల ఎన్నికలని తెలిపారు. కార్యకర్తలకు సముచిత స్థానం ఇచ్చినప్పుడే పార్టీ బలపడుతుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నేతలకు ఆయన సూచించారు. అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లల్లో ఎన్నో సంక్షేమ పథకాలను అందించామని.. ఇంకా చేయాల్సింది ఎంతో ఉందన్నారు. అయితే అధికార పార్టీలో టికెట్ ఆశించే వాళ్లు ఎక్కువగా ఉండటం సహజమని.. ఎంతో మంది పోటీ పడ్డా.. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ దక్కడం మీ అదృష్టమని అభ్యర్థులకు సోదాహరణగా వివరించారు. ఒక్క ఓటు.. గెలుపు ఓటములను నిర్ణయిస్తుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

టికెట్ రాని వారిని కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలంటూ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థలకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. పదేళ్ల పాలనలో గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోయినా మన ప్రభుత్వంలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందించామని చెప్పుకొచ్చారు. పేదలకు సన్న బియ్యం.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించామని వివరించారు. మహిళా గ్రూపులకు సున్నా వడ్డీ రుణాలు అందించామని పేర్కొన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించామన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలతోపాటు వాటి వల్ల చేకూరిన లబ్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మున్సిపల్ అభ్యర్థులకు స్పష్టం చేశారు. మనం అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదని.. ప్రభుత్వం చేసిందే ప్రజలకు చెప్పండంటూ వారికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.