Mahaa Daily Exclusive

  జనసేన.. పెద్దప్లానింగే

Share

  • జనసేన.. పెద్దప్లానింగే
  • మునిసిపాలిటీతో మొదలు
  • జీహెచ్ఎంసి నాటికి శక్తిగా..
  • వచ్చే అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఫిక్స్
  • 336 వార్డుల్లో పోటీ చేస్తున్న జనసేన
  • కరీంనగర్ జిల్లాలో 56, నిజామాబాద్ లో 48 స్థానాల్లో
  • ప్రచారానికి జనసేనాని పవన్ దూరం
  • జీహెచ్ఎంసి సమయంలో రంగంలోకి

హైదరాబాద్, మహా

జనసేన తెలంగాణలో దూకుడుగానే పోటీచేస్తోంది. మునిసిపల్ బరిలో ఎంట్రీ ఇచ్చి.. జీహెచ్ఎంసి నాటికి శక్తిగా మారి, వచ్చే అసెంబ్లీలో ఖచ్చితంగా అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తోంది. పెద్ద ప్లానింగ్ తోనే బరిలో కి దిగింది. రాష్ట్రంలో ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ 336 వార్డుల్లో పోటీ చేస్తోంది. జనసేన పార్టీ పోటీచేస్తున్న స్థానాలపై అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఒకేసారి జనసేన పార్టీ ఇన్ని స్థానాల్లో పోటీచేయడం సామాన్యమైన విషయం కాదు. పవన్ కల్యాణ్ మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి రావాలని మొదట భావించినా, తెలంగాణ ఆంధ్రలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారానికి ఇది సరైన సమయం కాదని భావించినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసి ఎన్నికల సమయంలో ప్రచారంలోకి దిగితే ప్రభావం బలంగా ఉంటుందన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

జిల్లాల వారీగా లిస్ట్ ఇదే

జిల్లాల వారీగా తమ పార్టీ అభ్యర్థులు ఎంత మంది పోటీ చేస్తున్నారో పేర్కొంది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 56 వార్డుల్లో, అత్యల్పంగా మహబూబాబాద్ జిల్లాలో 5 వార్డుల్లో పోటీ చేస్తోంది. 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 336 వార్డుల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, వారి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులు ఆమోదించారని తెలిపింది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తు పై పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. జనసైనికులు, వీర మహిళలు పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేసింది. నిజామాబాద్‌లో 48, కొత్తగూడెంలో 22, రంగారెడ్డిలో 21, ఖమ్మంలో 17, వరంగల్‌లో 20, నల్గొండలో 46, మహబూబ్ నగర్‌లో 44, మహబూబాబాద్‌లో 5, మెదక్‌లో 18, కరీంనగర్‌లో 56, ఆదిలాబాద్‌లో 39 వార్డుల్లో జనసేన పోటీ చేస్తోంది. మునిసిపాలిటీలతో గ్లాసు బోణీ షురూ చేయాలని భావిస్తోంది. సినీనటుడు, యువ హీరో తనీష్ ప్రచారానికి కూడా మంచి స్పందన లభిస్తోంది.