- గద్దర్ అవార్డుల వేడుక..
నభూతో అనేలా జరగాలి - సినీపరిశ్రమలోని అన్ని విభాగాలకు అవార్డులు
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, మహా : వచ్చే ఉగాది రోజున గద్దర్ ఫిలిం అవార్డుల ఫంక్షన్ కార్యక్రమాన్ని ‘న భూతో న భవిష్యతి’ అన్న విధంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించాలని, ప్రపంచ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ వైపు తిరిగి చూసేలా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అందుకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా అందిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రసాద్ లాబ్స్‌లో గద్దర్ ఫిలిం అవార్డుల సందర్భంగా సినిమాల స్క్రీనింగ్ ప్రక్రియ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక మార్పు కోసం కళలను ఉపయోగించి, ప్రజల కోసం తన జీవితాన్ని ధారపోసిన మహానుభావుడు గద్దర్ అని ఆయన సేవలను డిప్యూటీ సీఎం కొనియాడారు. అందుకే ప్రజా ప్రభుత్వం ఆయన పేరిట సినిమా అవార్డులను ప్రారంభించి, ఇది రెండవ సంవత్సరం అని వివరించారు.
అందరికీ అవార్డులు
తెలుగు సినీ పరిశ్రమలోని అన్ని విభాగాలకు అవార్డులను ఇవ్వబోతున్నట్లు డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు. హైదరాబాద్ కేవలం తెలుగు ఇండస్ట్రీకే కాదు, భారతదేశంలోని వివిధ భాషలకు కేంద్రంగా మారాలని ప్రజాప్రభుత్వం గొప్ప సంకల్పంతో పనిచేస్తుందని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో ఉండే వాతావరణ పరిస్థితులు, నిపుణులు, శాంతి భద్రతలు దేశంలోని మరే ఇతర నగరాల్లో లేవని, హైదరాబాద్ మహానగరంలో ఉన్న సానుకూల వాతావరణాన్ని ఉపయోగించుకొని, హైదరాబాదును ప్రపంచ సినీ కేంద్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుని ముందుకుపోతుందని తెలిపారు.
అందుబాటులో ఉంటా
సినిమా పరిశ్రమకు అవసరమైన ఆర్థిక, సామాజిక, శాంతిభద్రతల పరంగా ఇంకా ఎటువంటి అవసరం అయినా,ఏం సమయంలోనైనా తమ ప్రజా ప్రభుత్వం తలుపు తట్టవచ్చని, సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు తాను అందుబాటులో ఉంటామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మణిశర్మ, ఎఫ్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.







