Mahaa Daily Exclusive

  జగిత్యాల రాజకీయ సెగ: కాంగ్రెస్‌లో ‘జీవన్’ మరణ పోరాటం!

Share

  • జగిత్యాలలో కాంగ్రెస్ కు జీవన్ సమస్య
  • సొంత అభ్యర్థులతో జీవన్ రెడ్డి ప్రచారం
  • గీత దాటిన సీనియర్ నేత
  • కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ గా సాగుతున్న ప్రచారం

జగిత్యాల, మహా : జగిత్యాల రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టీ. జీవన్ రెడ్డి ఆ పార్టీకి పెను సమస్యలు సృష్టిస్తున్నారు. పార్టీ విధేయులకు అన్యాయం జరుగుతోందంటూ ఆయన కన్నీరు పెట్టుకోవడం, ఏకంగా తన అనుచరులను రెబల్స్ గా బరిలోకి దింపడం కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారింది. జగిత్యాల నియోజకవర్గంలో దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండాను మోసిన జీవన్ రెడ్డికి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం, మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఆయన వర్గానికి పెద్దపీట వేయడం జీవన్ రెడ్డిని తీవ్ర అసహనానికి గురిచేసింది. తన ఇలాఖాలో తనకే పట్టులేకుండా చేస్తున్నారనే ఆవేదన ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది.

సంజయ్‌కు జగిత్యాల వదిలేస్తే రాజకీయ జీవితం అంతమైనట్లేనని భయం

జగిత్యాలలో చాలా కాలంగా కాంగ్రెస్ తరపున ఏకైక లీడర్ గా జీవన్ రెడ్డి ఉన్నారు. ఒకప్పుడు టీడీపీ నుంచి ఎల్.రమణ, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డిపోటీ పడేవారు. ఉద్యమం తర్వాత బీఆర్ఎస్ నుంచి సంజయ్ ఆ స్థానం దక్కించుకున్నారు. సీనియర్ లీడర్లు గెలవలేకపోయారు. తర్వాత ఇద్దరూ ఒక్కటైనా గెలవలేదు. ఎల్.రమణ పూర్తిగా సైడ్ అయిపోగా జీవన్ రెడ్డి మాత్రం పోరాడుతున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లోకి రావడంతో ఆయనకు ఉనికి సమస్యలు ప్రారంభమయ్యాయి. అందుకే తెగించి పోరాడుతున్నారు. రాష్ట్ర నాయకత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇప్పుడుప్రజల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు.
ప్రజల వద్ద కన్నీటి ప్రయోగం

ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లలో జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనవుతున్నారు. మున్సిపల్ ఎన్నికలప్రచారంలోనూ అంతే. ఏళ్ల తరబడి లాఠీ దెబ్బలు తిని, కేసులు ఎదుర్కొని పార్టీని బతికించిన కార్యకర్తలకు ఇవాళ టికెట్లు నిరాకరించడం దారుణం అని అంటున్నారు. పార్టీ తనను మోసం చేసిందంటూ ఆయన కన్నీరు పెట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, స్థానిక ప్రజల్లో సానుభూతిని పెంచింది. పార్టీ అధికారికంగా టికెట్లు ఇవ్వకపోయినా, తన వర్గీయులను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపారు. సుమారు 20 మందికి పైగా అభ్యర్థులు జీవన్ రెడ్డి ఆశీస్సులతో నామినేషన్లు వేయడం గమనార్హం. నేను కాంగ్రెస్ వాదినే, కానీ నా కార్యకర్తల ఆత్మగౌరవం కోసం ఈ పోరాటం తప్పదు అంటూ ఆయన చేస్తున్న ప్రచారం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా ఉంది.

జీవన్ రెడ్డిని బుజ్జగించలేకపోతున్న రాష్ట్ర నాయకత్వం

మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర కీలక నేతలకు జగిత్యాల వ్యవహారం మింగుడు పడటం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి సీనియర్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడం, జీవన్ రెడ్డి తన పంతం వీడకపోవడం పార్టీ క్రమశిక్షణపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. జగిత్యాల మున్సిపల్ పోరు ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. జీవన్ రెడ్డి ప్రయోగిస్తున్న ఈ సానుభూతి అస్త్రం ఆయన రాజకీయ సత్తా ను నిరూపిస్తుందా లేక పార్టీలో ఆయన ప్రాధాన్యతను తగ్గిస్తుందా అనేది ఫలితాల తర్వాతే తేలనుంది. జీవన్ రెడ్డి ఆఖరి పోరాటం అన్నట్లుగా ఆయన చేస్తున్న రాజకీయాన్ని ఎదుర్కొని సంజయ్.. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మాత్రం.. జీవన్ రెడ్డిని ఇక కాంగ్రెస్ లోనే పట్టించుకోరు. కానీ ఆయన వర్గీయులు ఎక్కువ మంది విజయం సాధిస్తే మాత్రం.. కాంగ్రెస్ లో వర్గ పోరు మరింత ఉదృతం అవుతుంది.