హైదరాబాద్, మహా : సొంతింటి కలను సాకారం చేస్తామని నమ్మించి కోట్లు కొల్లగొట్టి ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ లో భారీ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ సంస్థపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేసింది. ఫ్లాట్లు నిర్మించి ఇస్తామని నమ్మించి సుమారు 500 మంది నుండి దాదాపు రూ. 270 కోట్ల రూపాయలు వసూలు చేసి, ఆపై మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక ఫిర్యాదుల ద్వారా వెల్లడైంది. మూసాపేటకు చెందిన సుజాత అనే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
గత పదేళ్లుగా ప్రాజెక్టు పేరుతో కాలయాపన చేస్తున్న ఈ సంస్థ, 2018లో వెంచర్ ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేపట్టలేదు. ఫిర్యాదుదారు సుజాత తన ఫ్లాట్ కోసం రూ. 80 లక్షలు చెల్లించగా, సదరు సంస్థ అదే ఫ్లాట్‌ను బ్యాంకులో రూ. 1.27 కోట్ల రుణానికి గిరవు పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రాజెక్టులో కేవలం రెండు టవర్లు మాత్రమే కొంతమేర పూర్తి కాగా, మిగిలిన టవర్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, అసలు కొన్నింటి నిర్మాణం ప్రారంభమే కాలేదని బాధితులు వాపోతున్నారు. పోలీసుల విచారణ కొనసాగుతోందని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని ఈవోడబ్ల్యు అధికారులు తెలిపారు. ఒకే ఫ్లాట్‌ను ఒకరి కంటే ఎక్కువ మందికి అమ్మడం, గడువు ముగిసినా హ్యాండోవర్ చేయకపోవడం వంటి అక్రమాలపై ఇప్పటికే వందకు పైగా ఫిర్యాదులు పోలీసులకు అందాయి. దీనిపై స్పందించిన పోలీసులు సంస్థ యజమాని అజయ్‌తో పాటు మరికొందరు డైరెక్టర్లపై బీఎన్ఎస్ సెక్షన్లు, తెలంగాణ డిపాజిటర్ల రక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 318(4) మోసం, సెక్షన్ 316(2) నేరపూరిత కుట్ర, సెక్షన్ 316(5) నమ్మక ద్రోహం, తెలంగాణ డిపాజిటర్ల రక్షణ చట్టం సెక్షన్ 5 కింద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
ప్రాజెక్ట్ వివరాలు
ఈ వెంచర్ 2018లో ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు కేవలం ఏ,బి టవర్స్‌లో నిర్మాణం కొంతమేర పూర్తి చేశారు. సి.డి టవర్ల బేస్‌మెంట్లు మాత్రమే పూర్తయ్యాయి. ప్రాజెక్టులో ఈ.ఎఫ్, టవర్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. రెరా నమోదు గడువు ఇప్పటికే రెండుసార్లు పొడిగించగా, ఈ ఏడాది జూన్‌లో ముగియనుందని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. డిసెంబర్ 2024, డిసెంబర్ 2025లో హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి లక్షలు, కోట్ల రూపాయలు వసూలు చేసిన తర్వాత వాగ్దానాలు నెరవేర్చలేదని బాధితులు తెలిపారు. ఒకే ఫ్లాట్‌ను ఒకరికి మించి అమ్మినట్లు కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు.








