- జీవితం సూటిగా సాగదు
- ఫ్లెక్సిబుల్‌గా ఉండి పట్టుదలతో ముందుకు వెళ్లండి’
- – జెన్‌జీకి రాహుల్ గాంధీ సందేశం
మహా
నేటి యువత జీవితంపై అతిగా ఒత్తిడి పడాల్సిన అవసరం లేదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. జీవితం ఎప్పుడూ ఒకే దారిలో సూటిగా సాగదని అభిప్రాయపడ్డారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆలోచనలు మార్చుకుంటూ, పట్టుదలతో ముందుకు సాగితే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని జెన్‌జీకి సందేశం ఇచ్చారు. ఆదివారం ఢిల్లీలో యూఏఈకి చెందిన ఎన్ఆర్ఐ జెన్‌జీ విద్యార్థులతో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. యువత అడిగిన ప్రశ్నలకు ఆయన నేరుగా, ఎలాంటి ఫిల్టర్లూ లేకుండా సమాధానాలు ఇచ్చారు. ఆ సంభాషణకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్‌లో పంచుకున్నారు. విద్యార్థులతో చర్చలో నేటి యువత ఎదుర్కొంటున్న ఒత్తిడులు, భవిష్యత్‌పై అనిశ్చితి, కెరీర్ ఎంపికలపై సందేహాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. కెరీర్‌తో పాటు ప్యాషన్‌ను ఎలా కొనసాగించాలి? స్వేచ్ఛగా ఆలోచించడానికి, మాట్లాడడానికి ధైర్యం ఎలా పెంపొందించుకోవాలి? ఇతరుల విమర్శలు, జడ్జ్‌మెంట్‌ను ఎలా ఎదుర్కోవాలి? వంటి ప్రశ్నలను విద్యార్థులు ముందుంచారు. వారిలో చాలామంది తమకు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉందని, ఇతరులు ఎలా చూస్తారోనన్న భయం వెంటాడుతోందని తెలిపారు. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ, సమాజం మనపై లేబుల్స్ వేయడానికి ప్రయత్నిస్తుందని, కానీ మన అసలైన వ్యక్తిత్వాన్ని మనమే నిర్ణయించుకోవాలని సూచించారు. “ప్రపంచం మీకు మీరు ఎవరో చెబుతుంటుంది. కానీ మీకు మీరు నిజాయితీగా ఉండటం ముఖ్యమైంది” అన్నారు.







