Mahaa Daily Exclusive

  ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం……

Share

  • ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం
  • 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎల్లుండే పోలింగ్
  • వేగమైన తెరవెనుక ప్రయత్నాలు
  • ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్
  • 25 వేల మంది పోలీసులతో బందోబస్తు

తెలంగాణ బ్యూరో, మహా : దాదాపు రెండు నెలలుగా సాగుతున్న మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. ప్రచార గడువు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఎన్నికల మైకులు బంద్ అయ్యాయి. ఈనెల 11వ తేదీన రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లలో 414 వార్డు డివిజన్లకు 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డులకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మొత్తం పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి 12,930 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం.. 8,203 పోలింగ్‌ కేంద్రాలను రెడీ చేసింది. మొత్తం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి 52 లక్షలకు పైగా ఓటర్లు ఓటు వేయనున్నారు. ఈనెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టగా ఈనెల 14వ తేదీన మేయర్, ఛైర్‌పర్సన్ల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక ఈనెల 16వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఏడు నగరపాలికలు, 116 పురపాలికలు కలిపి మొత్తం 123 మున్సిపల్, కార్పొరేషన్ల పరిధిలో 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించేందుకు సిద్ధమయ్యారు. వీరిలో 25,62,639 మంది పురుష ఓటర్లు కాగా.. మహిళా ఓటర్లు 26,80,014 మంది ఉన్నారు. సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా మహిళల కంటే పురుషుల ఓటర్ల సంఖ్య అధికంగా ఉంటుంది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండటం విశేషం. పురుషులు, మహిళలు మాత్రమే కాకుండా మరో 640 మంది ట్రాన్స్‌జెండర్లు కూడా ఈ ఎన్నికల్లో తమ ఓటును వేయనున్నారు.

మరోవైపు.. ఎన్నికల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,195 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ మున్సిపల్ ఎన్నికల కోసం ఏకంగా 16,031 బ్యాలెట్ బాక్స్‌లను రెడీ చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు 1,379 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. వీరితోపాటు 1,547 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి పర్యవేక్షణ కోసం 9,560 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు.. 31,428 మంది ఇతర సిబ్బంది మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. పోలింగ్ పూర్తి అయిన తర్వాత.. బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరచడానికి 137 స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 136 కౌంటింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసింది.

25 వేల మంది పోలీసులతో బందోబస్తు

సుమారు 25 వేల మంది పోలీసులతో రాష్ట్రవ్యాప్తంగా నిఘాను ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల వద్ద అదనపు బలగాలను మోహరించనున్నారు. పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. దీంతో ఎన్నికల సంఘం అధికారులు స్వయంగా పోలింగ్ జరుగుతున్న తీరును పర్యవేక్షించవచ్చు. ఈ ఎన్నికల్లో మొత్తం 12,930 మంది అభ్యర్థులు కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత.. ఓట్ల లెక్కింపును ఫిబ్రవరి 13వ తేదీన చేపట్టి.. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 14వ తేదీన కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు.. మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్, డిప్యూటీ ఛైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియను చేపట్టనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 16వ తేదీన కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారంతోపాటు.. ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.

ప్రచారంలో భాగంగా రాష్ట్ర నేతలతోపాటు జాతీయ నేతలు కూడా కాంగ్రెస్, బీజేపీ పార్టీ అభ్యర్థుల తరఫున మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పర్యటనలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారంతో గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పుడు ప్రచారం ముగియడంతో అంతా నిశ్శబ్దంగా ఉంది. తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.

Latest