- మా జిల్లాకు మంత్రి పదవి కావాలి
- నా కులమే అడ్డయితే రాజీనామా చేస్తా
- మరో సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తా
- ఇబ్రహిపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, మహా : మంత్రి పదవిపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడానికి కులమే అడ్డయితే రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని అన్నారు. మరో సామాజికవర్గానికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తానని అధిష్టానానికి హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత తప్పకుండా రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని అన్నారు. రంగారెడ్డి జిల్లాను ఎంతో అభివృద్ధి చేశానని, ఈ ప్రాంత ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని ప్రకటించారు.
మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కించుకునేందుకు కాంగ్రెస్‌లోని పలువురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేకపోవటంతో ఆ జిల్లాకు చెందిన నేతలకు త్వరలోనే జరగబోయే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో మల్రెడ్డి రంగారెడ్డి లేదంటే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలలో ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందన్న ప్రచారమూ జరిగింది. అయితే, అనూహ్యంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పరిగి వేదికగా చేసిన వ్యాఖ్యలతో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రంజిత్ రెడ్డికి మంత్రి వర్గంలో చోటు ఖాయమైనట్లు ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో మల్రెడ్డి రంగారెడ్డి అప్రమత్తమై అధిష్టానానికి కీలక సందేశం ఇచ్చారు.








