- ఫలితాలకు ముందే ఓటమిని ఒప్పుకున్న సీఎం
- ఓటమి భయంతోనే బీజేపీపై అవాకులు, చెవాకులు
- ఎంఐఎంతో డీల్ కుదిరిందా? లేదా? సమాధానం చెప్పాలి
- కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదని రేవంత్ లేఖ రాయాలి
- వాళ్ల సంగతి మేం చూసుకుంటాం
- సీఎం వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్
హైదరాబాద్, మహా : మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కు ముందే కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, మున్సిపాలిటీలకు నిధులివ్వకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని ప్రజలంతా డిసైడ్ అయ్యారన్నారు. ఇంటెలిజెన్స్, సర్వేల ద్వారా సమాచారం తెప్పించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఓటమి ఖాయమనే ఫస్ట్రేషన్ తో బీజేపీపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. .
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తనను కలిసిన మీడియా ఛానళ్లతో మాట్లాడుతూ వారు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. రెండేళ్ళ కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నయాపైసా ఇచ్చారా? గ్రామ పంచాయతీలకు నిధులిచ్చారా? కేంద్రం నిధులు మంజూరు చేసిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? పైగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదు. ఉద్యోగుల బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెన్ ఫిట్స్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పై కోపంతో కాంగ్రెస్ కు ఓటేసి గెలిపిస్తే రెండేళ్లలో కాంగ్రెస్ బండారం బయట పడిందన్నారు. ఆ పార్టీ సంగతి అర్ధమైంది కాబట్టే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని ప్రజలంతా డిసైడ్ అయ్యారని చెప్పారు. ఒవైసీని తాను దేవుడిలా తలుస్తున్నట్లు సీఎం చెప్పడంపై తనదైన శైలిలో స్పందిస్తూ సీఎం, ఒవైసీ మాట్లాడుతున్న స్క్రిప్ట్ ఒకటే. మొన్న ఒవైసీ కరీంనగర్ వచ్చి బండి సంజయ్ కు తన భార్య కంటే నన్నే ఎక్కువ ఇష్టపడతారని చెప్పారు. ఇవాళ సీఎం కూడా బండి సంజయ్ ను ఒవైసీని దేవుడిలా చూస్తారని చెప్పారు. బహుశా ఇద్దరి స్క్రిప్ట్ దారుస్సలాంలోనో లేక గాంధీభవన్ లో ప్రిపేర్ అవుతున్నట్లుందన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య రూ.100 కోట్ల డీల్ కుదిరిందా? లేదా? కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులకు డబ్బులు ఇవ్వకుండా ఎంఐఎం అభ్యర్థులకు ఎందుకు పంపిస్తోంది? ఈ విషయంపై కాంగ్రెస్ అభ్యర్థులే కోపంగా ఉన్నారు కదా? దీనికి ఎందుకు సమాధానం చెప్పడం లేదు? అని ప్రశ్నించారు. ఎవరు నాగుపాము? ఎవరు జెర్రిపోతో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పిన బండి సంజయ్ బీఆర్ఎస్ అనే నాగుపామును ప్రజలను ఖతం చేశారని, రేపు జెర్రిపోతులాంటి కాంగ్రెస్ కు కూడా అదే గతి పట్టబోతుందని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో సీఎం తన చేతగానితనాన్ని ఇతరులపై నెట్టడం అలవాటైందని ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించే దమ్ములేదు. సీఎంగా రేవంత్ ఉండగానే కదా ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోయింది. మరి పారిపోతుంటే ఏం చేశారు? తప్పించుకోవడానికి ఇవన్నీ డ్రామాలాడుతున్నారు. సీఎంను అడుగుతున్నా ‘‘నాకు చేతగాదు, నాకు ఆవేశం లేదు. రోషం, పౌరుషం లేదని, కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము అసలే లేదని కేంద్రానికి లేఖ రాయండి. అప్పుడు మేం ఏం చేస్తారో మీరే చూస్తారని బదులిచ్చారు.








