- మునిసిపల్ ఎన్నికల వేళ
- కాంగ్రెస్‌కు షాక్
- బీఆర్ఎస్కు ఓటేయమన్న గూడెం మహిపాల్ రెడ్డి
హైదరాబాద్, మహా : మున్సిపల్ ఎన్నికల వేళ పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చి సంచలనం సృష్టించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్న మహిపాల్ రెడ్డి కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలోనూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తను కాంగ్రెస్ చేరడం వల్ల చిల్లీగవ్వ లాభం చేకూరలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్మిక సంఘం నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే వారిని బీఆర్ఎస్ కు ఓటువేయాలని కోరడం గమనార్హం. అయితే.. కొంతకాలంగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న మహిపాల్ రెడ్డి, పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి సహా కొందరు అనుచరులు ఇటీవల బీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తమ నియోజకవర్గానికి ఎలాంటి ప్రయోజనాలు రాలేదన్న కారణంతో మహిపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆయన అధికారికంగా బీఆర్ఎస్లో చేరతారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన మహిపాల్ రెడ్డి.. ప్రస్తుతం ఆ పార్టీపై విమర్శలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.








