Mahaa Daily Exclusive

  మూడు ముక్కలుగా జీహెచ్ఎంసీ: నేటితో ముగిసిన పాలక మండలి గడువు.. ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం!

Share

  • మూడు ముక్కలుగా జీహెచ్ఎంసీ
  • ముగిసిన పాలక మండలి గడువు
  • నేడు నోటిఫికేషన్ జారీ

హైదరాబాద్, మహా : గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పాలక వర్గం గడువు ముగిసింది. ఫిబ్రవరి 10 తో అయిదేళ్ళ పదవీ కాలం పూర్తి కావడంతో జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికార పాలన కిందకు వచ్చింది. పాలనా సౌలభ్యం కోసం కొన్నాళ్ళ క్రితం గ్రేటర్ ను విస్తరించిన రాష్ట్ర ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్ పరిధిలోని మునిసిపాలిటీలు, కార్పొరే,న్లను విలీనం చేసింది. దీంతో 150 కార్పొరేషన్ స్థానాలున్న గ్రేటర్ హైదరాాద్ 300 కార్పొరేటర్ స్థానాలకు పెరిగాయి. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ (జీహెచ్ సీ) గా ప్రస్తుత జీహెచ్ఎంసీని రూపొంతరం చేసి 300 డివిజన్ల అతి పెద్ద కార్పొరేషన్ గా చేయాలనుకున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే జీహెచ్ సీ గా చేయకుండా ప్రస్తుత జీహెచ్ఎంసీని మూడు గా విభజిస్తే ప్రజలకు మరుంత మెరుగైన సేవలు అందేందుకు వీలుంటుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంఎంసీ), గ్రేటర్ సైబరాబాద్ లేదా గ్రేటర్ శేరిలింగంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (జీఎస్ఎంసీ) గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్పొరేషన్లకు సంబంధించిన కార్యాలయాలను కూడా ప్రభుత్వం సిద్దం చేసింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఉంటుంది. తార్నాకలోని హుడా కార్యాలయం లో గ్రేటర్ మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్ (జీఎంఎంసీ) ఆఫీస్ ను, మాదాపూర్ లోని నాక్ బిల్డింగ్ లో గ్రేటర్ సైబరాబాద్ ( గ్రేటర్ శేరిలింగంపల్లి)కార్పొరేషన్ ఆఫీస్ (జీఎస్ఎంసీ) కార్యాలయం ఏర్పాటు కానున్నాయి. 150 వార్డులతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, 74 వార్డులతో గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్, 76 వార్డుల తో గ్రేటర్ సైబరాబాద్ ( గ్రేటర్ శేరిలింగంపల్లి) కార్పొరేషన్ లు ప్రజా ప్రతినిధులతో కొలువు తీరనున్నాయి.

జీహెచ్ఎంసీలో ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కొండ జోన్ లతో, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్ బీ నగర్ జోన్ లతో గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి జోన్ లతో గ్రేటర్ సైబరాబాద్ ( గ్రేటర్ శేరిలింగంపల్లి ) కార్పొరేషన్ లలో ఉండనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ను మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటైన 6 నెలల లోపు పాలకవర్గాల ఎన్నికలు జరుగనున్నాయి. అంటే ఆగస్ట్ వరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికలు అయ్యేవరకు స్పెషల్ ఆఫీసర్స్ పాలన లో మూడు కార్పొరేషన్లు కొనసాగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ కు ప్రస్తుత కమిషనర్ కర్ణన్, గ్రేటర్ మల్కాజిగిరి కి వినయ్ కృష్ణా రెడ్డి, గ్రేటర్ సైబరాబాద్ ( గ్రేటర్ శేరిలింగంపల్లి ) కి సృజన స్పెషల్ కమిషనర్లు గా బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో 650 చదరపు కిలోమీటర్లు ఉన్న జీహెచ్ఎంసీ,, ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో ప్రస్తుత జీహెచ్ఎంసీ విస్తీర్ణం 2050 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. జనాభా ఒక కోటి 34 లక్షలుగా ఉండనుంది.

Latest