- మునిసిపల్ ఎన్నికల వేళ
- మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య
- వేధింపులే కారణమంటున్న బీజేపీ
నారాయణపేట, మహా : మునిసిపల్ ఎన్నికలకు సర్వం సిద్దమైన వేళ మక్తల్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నారు. మహదేవప్ప మక్తల్ మునిసిపాలిటీలోని ఆరవ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే ఆత్మహత్యకు ప్రత్యర్థుల వేధింపులే కారణమని వారి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. మహదేవప్ప ఆరవ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ప్రచారం చివరి రోజు సోమవారం ఎంపీ డీకే అరుణతో కలిసి ప్రచారంలో పాల్గొన్న మహదేవ్ అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ముందు నుంచే మహదేవ్‌పై ఒత్తిళ్లు ఉన్నాయని కుటుంబసభ్యులు తెలిపారు. బుధవారం పోలింగ్ ఉండడంతో కొందరు వ్యక్తులు బెదిరించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ప్రత్యర్థి అభ్యర్థుల బెదిరింపుల వల్లే ఇతను సూసైడ్ చేసుకున్నారా.. వేరే కారణం ఉందా అనే దానిపై దర్యాప్తు చేపడుతున్నారు.
మక్తల్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి సూసైడ్
హైదరాబాద్ డీజీపీ ఆఫీసు వద్ద హైటెన్షన్
అధికార కాంగ్రెస్ కారణమంటూ బీజేపీ శ్రేణుల ఆందోళన’
హైదరాబాద్, మహా : మహదేవప్ప సూసైడ్ ఘటనతో మక్తల్ పట్టణంతో పాటు హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ వద్ద ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ శ్రేణులు డీజీపీ ఆఫీసు ముట్టడికి యత్నించాయి. పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ.. డీజీపీ ఆఫీసులోకి బీజేపీ కార్యకర్తలు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపు చేశారు. పలువుర్ని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. రవీంద్ర భారతి, డీజీపీ కార్యాలయం, అసెంబ్లీ పరిసర ప్రాంతాలలో సాయంత్రం వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
స్పందించిన డీజీపీ
మరో వైపు మహదేవప్ప సూసైడ్‌పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. అతడి వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటన్నది తేలిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ఆత్మహత్య కలచి వేసింది : బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
మహదేవప్ప ఆత్మహత్య ఘటన తీవ్రంగా కలచివేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. అతడి ఆత్మహత్యకు కాంగ్రెస్ అహంకారపూరిత రాజకీయాలు, బెదిరింపులే కారణమని ఆరోపించారు. మంత్రి శ్రీహరి, ఆయన అనుచరుల వేధింపులు తట్టుకోలేకే తమ పార్టీ అభ్యర్థి మహదేవప్ప ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. అధికార మత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని ఫైరయ్యారు. మంత్రి అహంకారపూరిత రాజకీయాలకు ఓ నిండు ప్రాణం బలైందని వాపోయారు. ఈ ఘటనకు కారణమైన మంత్రి శ్రీహరిని తక్షణమే అరెస్ట్ చేయటంతో పాటు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం నిష్పక్షపాత విచారణ జరపాలని.. లేనిపక్షంలో భాజపా కార్యకర్తల ఆగ్రహ జ్వాలలకు గురికాక తప్పదని హెచ్చరించారు. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టకూడదని.. మహదేవప్ప కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు.








