- హెచ్ సీయూలో ల్యాప్ టాప్ ల చోరీ
- రూ. 25 లక్షల విలువ చేసే 50 ల్యాప్ టాప్ ల అపహరణ
- ల్యాప్ టాప్ లో ప్రాజెక్టు రిపోర్టులున్నాయంటున్న విద్యార్థులు
- కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు
హైదరాబాద్, మహా : గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ) ప్రాంగణంలో ఉన్న ప్రతిష్టాత్మక సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్‌లో భారీ చోరీ జరిగింది. రూ. 25 లక్షల విలువైన 50 ల్యాప్‌టాప్‌లను గుర్తు తెలియని దుండగులు అపహరించడం సంచలనంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ కు సంబంధించిన ఓ తరగతి గది కిటికీ గ్రిల్స్‌ను చాకచక్యంగా తొలగించారు. అనంతరం దుండగులు లోపలికి ప్రవేశించి 50 ల్యాప్‌టాప్‌లను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం తరగతి గదిలో ల్యాప్‌టాప్‌లు మాయం కావడంతో వర్సిటీ యాజమాన్యం గచ్చిబౌలి పోలీసులకు పిర్యాదు చేసింది. విచారించిన పోలీసులు తరగతి గది కిటికీ గ్రిల్స్ తొలగించి ఉండడం, కారు టైర్ గుర్తులు ఉన్నట్లుగా గుర్తించారు. అయితే దొంగిలించిన ల్యాప్‌టాప్‌లను కారులో తరలించినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. యూనివర్సిటీ సెక్యూరిటీ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కారు నంబర్ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వివరాల కోసం హెచ్సియులోని సీసీ కెమెరాలను మొత్తం పరిశీలిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తులో భాగంగా సి.ఆర్. రావు ఇన్‌స్టిట్యూట్, వర్సిటీ ప్రధాన ద్వారాల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. దొంగలు ల్యాప్‌టాప్‌లను ఒక కారులో తరలించినట్లు కెమెరాల్లో రికార్డు అయ్యింది. అయితే నిందితులు క్యాంపస్ లోపలికి ఎలా ప్రవేశించారు ? వారికి లోపలి వ్యక్తుల సహకారం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. వివరాల కోసం హెచ్సియులోని సీసీ కెమెరాలను మొత్తం పరిశీలిస్తున్నారు. ల్యాప్ టాప్‌లు చోరీకి గురి కావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాజెక్ట్ డేటా, పరిశోధనలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా వాటిల్లోనే ఉందని, అవి దొరకకపోతే తాము నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితులు ట్యాప్ టాప్‌లను ఫార్మాట్ చేయకముందే పట్టుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఉండే యూనివర్సిటీలో చోరీ జరగడం కలకలం రేపింది. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.








