Mahaa Daily Exclusive

  మహానగరం మూడు ముక్కలు: జీహెచ్‌ఎంసీ పునర్విభజన పూర్తి – అమల్లోకి వచ్చిన కొత్త కార్పొరేషన్ల పాలన

Share

  • 3 కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ
  • కొత్త అధ్యాయానికి అంకురం
  • మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, మహా : గ్రేటర్ హైదరాబాద్ పరిపాలనలో బుధవారం ఒక చారిత్రక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటివరకు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా విభజించింది. గతంలో ఉన్న 150 డివిజన్లు పునర్విభజన అనంతరం 243 స్థానాలకు పెరిగాయి. శివారు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల విలీనంతో మరో 57 డివిజన్లు అదనంగా చేరాయి. ఇలా మొత్తం 300 డివిజన్లతో విస్తరించిన మహా నగరాన్ని పరిపాలన సౌలభ్యం కోసం, అధికార వికేంద్రీకరణ లక్ష్యంతో ప్రభుత్వం మూడు కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లుగా విడగొట్టింది. దీనికి సంబంధించి జిహెచ్ఎంసి చట్టం-1955లోని సెక్షన్-3(1) ప్రకారం అధికారిక గెజిట్ విడుదల కావడంతో బుధవారం నుంచి నూతన కార్పొరేషన్లు విడివిడిగా కార్యకలాపాలు ప్రారంభించాయి

పరిపాలనా సంస్కరణల్లో భాగంగా హైదరాబాద్ మహానగర పరిధిలోని కీలక మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త కమిషనర్లు నియమితులయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్‌గా ఆర్.వి. కర్ణన్ బాధ్యతలు స్వీకరించగా, ఐటీ కారిడార్‌తో కూడిన కీలకమైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) బాధ్యతలను జి. సృజన చేపట్టారు. మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) కమిషనర్‌గా టి. వినయ్ కృష్ణారెడ్డి విధుల్లో చేరారు. ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని తెలంగాణ ప్రధాన పట్టణ ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో 2024 సెప్టెంబరులో 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. ఆ తర్వాత 20 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలను కూడా జిహెచ్ఎంసిలో కలిపారు. ఈ విలీనాల అనంతరం డివిజన్ల పునర్విభజన పూర్తి చేసి నగరాన్ని 300 డివిజన్లుగా, 60 సర్కిళ్లుగా, 12 జోన్లుగా వర్గీకరించారు. ఫిబ్రవరి 10, 2026 నాటికి పాత పాలకమండలి గడువు ముగియడంతో వెంటనే ఈ విభజన ప్రక్రియ అమల్లోకి వచ్చింది.

నూతనంగా ఏర్పడిన ఈ 3 కార్పొరేషన్ల ద్వారా స్థానిక సమస్యల పరిష్కారం వేగవంతం కానుంది. పౌర సేవలు ప్రజలకు మరింత చేరువ చేయడమే కాకుండా, మౌలిక సదుపాయాల కల్పనలో స్పష్టత తీసుకురావడానికి ఈ విభజన దోహదపడుతుంది. ఒక్కో కార్పొరేషన్ తన పరిధిలోని నిధులను, వనరులను స్వయంప్రతిపత్తితో వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమబద్ధీకరణ ద్వారా హైదరాబాద్ మహానగరం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ)

పాత జీహెచ్‌ఎంసీలోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్లకు విలీనమైన మణికొండ, నార్సింగి, తెల్లాపూర్, అమీన్‌పూర్, బొల్లారం, నిజాంపేట్, దుండిగల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌ పట్టణ స్థానిక సంస్థలు కలిశాయి. కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్లతో సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(సీఎంసీ) ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాలు పూర్తిగా, పటాన్‌చెరు, కూకట్‌పల్లి, మేడ్చల్, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి.

మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎంఎంసీ)

పాత జీహెచ్‌ఎంసీలోని సికింద్రాబాద్‌, ఎల్బీనగర్ జోన్లు పాక్షికంగా విలీనమైన బోడుప్పల్, ఫీర్జాదిగూడ, పోచారం, నాగారం, దమ్మాయిగూడ, ఘట్‌కేసర్, జవహర్‌నగర్, తూముకుంట యూఎల్‌బీలతో మల్కాజిగిరి, ఎల్బీనగర్‌, ఉప్పల్ జోన్లు అయ్యాయి. వాటితో మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎంఎంసీ) ఏర్పాటు చేశారు. మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గాలు పూర్తిగా, మేడ్చల్, కూకట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలు పాక్షికంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కిందకు వచ్చాయి.

జీహెచ్‌ఎంసీ..

పాత గ్రేటర్‌ పరిధిలోని ఖైరతాబాద్, చార్మినార్‌ జోన్లు సికింద్రాబాద్, ఎల్బీనగర్‌ జోన్లలోని కొన్ని ప్రాంతాలు, శంషాబాద్, జల్‌పల్లి, బండ్లగూడ జాగీర్, బడంగ్‌పేట్, తుక్కుగూడ, ఆదిభట్ల, మీర్‌పేట్, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట యూఎల్‌బీలతో ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్,గోల్కొండ, శంషాబాద్, రాజేంద్రనగర్‌ జోన్లు అయ్యాయి. వాటితో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, మలక్‌పేట్, అంబర్‌పేట, సనత్‌నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పుర, సికింద్రాబాద్‌ నియోజకవర్గాలు పూర్తిగా, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి.

మూడు కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్

గ్రేటర్ కాల పరిమితి పూర్తి కావటంతో మూడు కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్‌గా జయేష్‌ రంజన్ కు బాధ్యతలు అప్పగించారు. కొత్త పాలకమండలి వచ్చే వరకు స్పెషల్ ఆఫీసర్‌గా జయేష్ రంజన్ కొనసాగనున్నారు. అదే విధంగా మల్కాజ్‌గిరి జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎస్.పంకజ ను నియమించారు. హైదరాబాద్ ఈడీగా సామ్రాట్ అశోక్, సైబరాబాద్ ఈడీగా ఎం.సంతోష్, లోక్‌భవన్ జాయింట్ సెక్రటరీగా కె.కిరణాచారి నియమితులయ్యారు.

Latest