- రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడనుందా?
- లోక్‌సభలో బీజేపీ ఎంపీ సంచలన ప్రతిపాదన
- దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ
- రాహుల్ గాంధీపై సబ్ స్టాంటివ్ మోషన్ దాఖలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే
న్యూఢిల్లీ, మహా : లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆయనపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే గురువారం సంచలన ప్రతిపాదన చేశారు. రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా, ఆయనపై జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ ‘సబ్‌స్టాంటివ్ మోషన్’ దాఖలు చేశారు.
సబ్‌స్టాంటివ్ మోషన్ అంటే ?
సాధారణంగా పార్లమెంటులో ఏదైనా ఒక ముఖ్యమైన అంశంపై సభ నిర్ణయాన్ని లేదా అభిప్రాయాన్ని కోరుతూ ప్రవేశపెట్టే స్వతంత్ర అధికారిక ప్రతిపాదనను ‘సబ్‌స్టాంటివ్ మోషన్’ అంటారు. దీనిపై చర్చ జరిగిన తర్వాత సభ ఒక నిర్దిష్ట నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది.
నిషికాంత్ దూబే ఆరోపణలు ఇవే
“జార్జ్ సోరోస్ వంటి శక్తుల అండతో రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మన దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఆయన తీరు ఉంది. అందుకే ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా, భవిష్యత్తులో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని నేను లోక్‌సభలో ప్రతిపాదించాను” అని దూబే వార్తా సంస్థ ఏఎన్ఐతో పేర్కొన్నారు. బుధవారం సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలే ఈ పరిణామాలకు కారణమయ్యాయి. అయితే, ప్రభుత్వం రాహుల్ పై ‘ప్రివిలేజ్ మోషన్’ వేసే ఆలోచనలో లేదని, దానికి బదులుగా ఆయన ప్రసంగంలోని వివాదాస్పద అంశాలను రికార్డుల నుంచి తొలగించాలని కోరాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
రాహుల్ చేసిన విమర్శలు ఇవే
లోక్‌సభలో ఇంధన భద్రత, అంతర్జాతీయ సంబంధాలపై రాహుల్ గాంధీ కేంద్రాన్ని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికా ఒత్తిళ్లకు లొంగిపోతోందని ఆయన ఆరోపించారు. “ప్రస్తుతం ప్రపంచం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇంధనం, ఆర్థిక వ్యవస్థలను ఇతర దేశాలు ఆయుధాలుగా వాడుకుంటున్నాయని మీరే స్వయంగా ఒప్పుకుంటున్నారు. కానీ అమెరికా అవే అస్త్రాలను మనపై ప్రయోగిస్తున్నా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు?” అని ప్రశ్నించారు. ముఖ్యంగా ఇంధన భద్రత గురించి మాట్లాడుతూ.. “ఫలానా దేశం నుంచి చమురు కొనకూడదని అమెరికా చెబితే మనం వినాలా? అంటే మన ఇంధన భద్రతను విదేశీ శక్తులు నియంత్రిస్తున్నాయన్నమాట. దీనిపై మీకు సిగ్గుగా అనిపించడం లేదా? మీరు భారత్ ప్రయోజనాలతో రాజీ పడుతున్నారు” అని ఆయన ధ్వజమెత్తారు.
భారతదేశంలో సగటు దిగుమతి సుంకాలు 3 శాతం నుండి ఏకంగా 18 శాతానికి పెరిగాయని, ఇది ఆరు రెట్ల పెరుగుదల అని రాహుల్ గుర్తు చేశారు. ఇదే సమయంలో అమెరికా నుండి వచ్చే దిగుమతులు 46 బిలియన్ డాలర్ల నుంచి 146 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. మనకు ఎలాంటి గ్యారంటీలు లభించకుండానే ప్రతి ఏటా సుమారు 100 బిలియన్ డాలర్ల దిగుమతులను పెంచుకోవడానికి ఒప్పుకోవడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు. రాహుల్ ప్రసంగం సభలో సెగలు పుట్టించగా, దానికి కౌంటర్‌గా బీజేపీ ఈ మోషన్‌ను తీసుకురావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.








