Mahaa Daily Exclusive

  విశాఖపట్టణం కేంద్రంగా.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రైల్వే జోన్…

Share

  • విశాఖపట్టణం కేంద్రంగా
  • ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రైల్వే జోన్
  • 3 డివిజన్లకు పరిమితం కానున్న దక్షిణ మద్య రైల్వే
  • విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ కేంద్రంగా కార్యకలాపాలు

హైదరాబాద్, మహా : దక్షిణమధ్య రైల్వే పునర్విభజన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కొత్త రైల్వే జోన్ కు అపాయింటెడ్ డేను కేంద్ర ప్రభుత్వం తొందరలోనే ప్రకటించనున్నట్టు తెలిసింది. ఏప్రిల్ నుంచి నూతన రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభింపజేయాలని రైల్వేశాఖ భావిస్తున్నట్లు ద.మ. రైల్వే వర్గాలకు సంకేతాలు అందినట్లు సమాచారం. ఇది అమల్లోకి వస్తే ఆరు డివిజన్లతో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న ద.మ. రైల్వే జోన్ సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ లకే పరిమితం అవుతుంది. మిగతా విజయవాడ, గుంటూరు, గుంతకల్లుతో పాటు తూర్పు కోస్తా జోన్ లోని కొంతభాగంతో కలిపి కొత్తగా ఏర్పడే విశాఖపట్నం డివిజన్ తో కలిపి దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటవుతుంది.

ఉన్న సమయం తక్కువే..

కొత్త జోన్ కు ఏప్రిల్ 1వ తేదీ అపాయింటెడ్ డే అంటే.. ఇంకా ఆరు వారాలే ఉంది. కొత్త జోన్ ప్రారంభానికి ఇంత తక్కువ సమయం సాంకేతికంగా సరిపోతుందా అన్న కోణంలోనూ రైల్వేబోర్డులో చర్చ జరిగినట్లు తెలిసింది. సాధ్యాసాధ్యాలపై కొద్దిరోజుల్లోనే స్పష్టత వస్తుందని.. నెలాఖరుకల్లా కొత్త జోన్ అపాయింటెడ్ డేపై నోటిఫికేషన్ రావచ్చంటూ ద.మ. రైల్వే ప్రధాన కార్యాలయం అధికారులు అంటున్నారు. డివిజన్ ల వారీగా విభజన, సరిహద్దుల్లో మార్పులు చేర్పులు, ఆదాయ వ్యయాలు, రైళ్ల నిర్వహణ సహా పలు అంశాలతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రైల్వేబోర్డుకు తొమ్మిది నెలల క్రితమే చేరింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. నూతన జోన్ కు కేంద్ర మంత్రివర్గం 2025 ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. కొన్ని నెలల నుంచే కొత్త జోన్ జీఎం, విభాగాధిపతులను బోర్డు దశలవారీగా నియమిస్తోంది.

మార్పులు, చేర్పులు ఇవే..

గుంతకల్లు డివిజన్ లో ఉన్న రాయచూరు-వాడి 108 కి. మీ. ల సెక్షన్ సికింద్రాబాద్ రైల్వే డివిజన్ కు పరిమితం కానుంది. విష్ణుపురం-పగిడిపల్లి, విష్ణుపురం-జానపహాడ్ 142 కి.మీ.ల మార్గాలు ప్రస్తుతం గుంటూరు డివిజన్ లో ఉండగా అవి సికింద్రాబాద్ కు బదిలీ అవుతాయి. 46 కి. మీ.ల మోటుమర్రి-కొండపల్లి మార్గం సికింద్రాబాద్ నుంచి విజయవాడ డివిజన్ పరిధిలోకి వెళతాయి.

Latest