- బీజేపీ ఆశలు అడియాశలేనా?
- తెలంగాణలో అధికారం కలేనా
- సందిగ్ధంలో అధిష్టానం
- పార్టీ పరిస్థితి పోస్టుమార్టం జరగాలంటున్న శ్రేణులు
హైదరాబాద్, మహా : తెలంగాణలో అధికారం సాధించాలనే బీజేపీ ఆశలు ఇప్పట్లో నెరవేరే పరిస్థితి కనిపించడం లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన కమలం పార్టీ తొలి స్థానానికి చేరుకునే ప్రయత్నాల్లో ఎక్కడ విఫలమవుతుందనేది చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా, పోరాట పటిమ చూపిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు అలసిపోయిందా? నాటి విరోచిత పోరాటం చేసిన నేతలు ఇప్పుడు అధికార బాధ్యతల్లో బిజీగా ఉండిపోతూ పార్టీని గాలికి వదిలేయడం వలనే పార్టీకి ఈ దుస్థితి దాపురించిందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తు లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులువేమీ కాదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతున్న బీజేపీ పార్టీ క్షేత్రస్థాయిలో ఇంకా బలం పుంజుకున్నట్లు కనిపించడం లేదని అంటున్నారు. ఇందుకు తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా నిలుస్తున్నాయని చూపుతున్నారు.
మొత్తం ఓట్లలో కేవలం 15.68 శాతం ఓట్లతోనే బీజేపీ సరిపెట్టుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి పోలైన 39.8 శాతం ఓట్లలో సగం కూడా బీజేపీ దక్కించుకోలేదని ఎత్తిచూపుతున్నారు. అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇరుపార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడాను గమనిస్తే అధికార పీఠానికి చేరుకోవాలంటే బీజేపీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. తెలంగాణలో నిలదొక్కుకోవాలని, అధికారంలోకి రావాలని బీజేపీ చాలా కాలంగా గట్టిగానే పోరాడుతోంది. రాష్ట్రస్థాయిలో సమర్థవంతమైన నాయకులు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం పెంచుకోలేకపోతుందని అంటున్నారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ సీట్లు ఉంటే 2023 ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 సీట్లకే పరిమితమైంది. కానీ, అక్కడకు ఆరు నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీకి సమానంగా 8 సీట్లను గెలుచుకుని తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశాలు తమ పార్టీకే ఉన్నాయని కమలనాథులు సంకేతాలు పంపారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన ఊపు ఆ తర్వాత కొనసాగించడంలో విఫలమవుతున్నారని వరుసగా జరుగుతున్న ఎన్నికలు రుజువు చేస్తున్నాయని అంటున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన మొదటి ఉప ఎన్నిక కంటోన్మెంట్ లో బీజేపీ అంతగా ప్రభావం చూపలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడం, పంచాయతీ ఎన్నికలు, తాజా మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోవడంతో బీజేపీ కార్యకర్తలలో దిగులు అవహిస్తోందని చెబుతున్నారు. రెండు కార్పొరేషన్లలో అత్యధిక కార్పొరేట్ స్థానాలు గెలిచినా మేయర్ పీఠాలు దక్కించుకునే అంత మెజార్టీ రాకపోవడం కూడా బీజేపీ శ్రేణులను నైరాశ్యానికి గురిచేస్తోంది. 8 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న పార్టీ.. ఒక్క ఎంపీ కూడా లేని బీఆర్ఎస్ పార్టీ కన్నా వెనుకబడటం చూస్తే తెలంగాణ వాకిలిలో బీజేపీది బలమా? వాపా అన్న చర్చ జరుగుతోంది. పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ వారి పరిధిలో ఒక్క మున్సిపాలిటీ కూడా దక్కించుకోకపోవడంపై పార్టీ హైకమాండ్ పునరాలోచించుకోవాలని సూచిస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ అర్వింద్ తమ పరిధిలోని కార్పొరేషన్లలో మెజార్టీ సాధించినప్పటికీ మున్సిపాలిటీని గాలికి వదిలేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ దుస్థితికి కారణాలపై పార్టీలో అంతర్గత పోస్టుమార్టం జరగాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు సూచిస్తున్నారు. ఇలానే ఉంటే రానున్న పరిషత్ ఎన్నికల్లో కూడా గెలుపు కష్టమేనన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయని అంటున్నారు. అదేసమయంలో రాష్ట్రంలో అధికారం సాధిస్తామన్న ఆశలను కూడా వదిలేసుకోవాల్సివుంటుందని హెచ్చరిస్తున్నారు.








