Mahaa Daily Exclusive

  ఐదు రాష్ట్రాల ఎన్నికలు….

Share

  • ఐదు రాష్ట్రాల ఎన్నికలు
  • కాంగ్రెస్‌ లో అంతర్గత సంక్షోభం
  • పార్టీకి తలనొప్పిగా మారిన కీలక నేతల వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, మహా : అస్సాం నుండి కేరళ వరకు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలు ఆ పార్టీ అంతర్గత సంక్షోభాన్ని మరోసారి బట్టబయలు చేశాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగకముందే నాయకుల మధ్య మొదలైన విభేదాలు, వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి పెద్ద తలనెప్పిగా మారాయి.

అస్సాంలో ఆత్మగౌరవ పోరు

అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా తన పదవికి రాజీనామా చేస్తూ ఆత్మగౌరవం దెబ్బతిందని వ్యాఖ్యానించడం పార్టీలో పెను ప్రకంపనలు సృష్టించింది. అధిష్టానం జోక్యం చేసుకుని ఆయనను బుజ్జగించడంతో రాజీనామా వెనక్కి తీసుకున్నప్పటికీ, పార్టీలో ఉన్న విభేదాలు మాత్రం సమసిపోలేదు. రాష్ట్ర యూనిట్‌లో గౌరవ్ గొగోయ్, రాకిబుల్ హుస్సేన్ వంటి ఇతర కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండటం వల్ల, ఎన్నికల నాటికి కేడర్ ఏకతాటిపైకి రావడం కష్టంగా కనిపిస్తోంది.

కేరళలో షాక్

కాంగ్రెస్ గెలుపుపై గట్టి ఆశలు పెట్టుకున్న కేరళలో, సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అద్భుతమైన నాయకుడని, వచ్చే ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సొంత కూటమి గెలుపు కోసం పోరాడాల్సిన సమయంలో, మిత్రధర్మాన్ని విస్మరించి ప్రత్యర్థిని కొనియాడటం కేడర్ మనోధైర్యాన్ని దెబ్బతీసింది.

సమన్వయ లోపం

మణిశంకర్ అయ్యర్ కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా, రాహుల్ గాంధీ నాయకత్వ శైలిని కూడా పరోక్షంగా విమర్శిస్తున్నారు. పార్టీలో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపుతూనే, ఒక రకమైన నిరాశను తన మాటల్లో వ్యక్తం చేశారు. పార్టీలో ఉత్పన్నమవుతున్న ఇలాంటి అంతర్గత విభేదాలను, కీలక నేతల అసంతృప్తిని పరిష్కరించే ఒక శక్తివంతమైన ట్రబుల్ షూటర్ ‘ నాయకత్వ స్థాయిలో కనిపించకపోవడం కాంగ్రెస్‌కు ఉన్న అతిపెద్ద బలహీనతగా మారింది.

మొత్తంగా చూస్తే, కాంగ్రెస్ పార్టీ బయటి శత్రువుల కంటే లోపల ఉన్న విభేదాల వల్లే ఎక్కువ నష్టపోతోంది. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, రాష్ట్ర స్థాయి నేతలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నించడం పార్టీని క్రమంగా బలహీనపరుస్తోంది. ఈ అంతర్గత చిచ్చును ఆర్పకపోతే, రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ తనను తాను ఓడించుకునే బాటలో పయనించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు

Latest