Mahaa Daily Exclusive

  మదనపల్లెలో దారుణం….

Share

  • మదనపల్లెలో దారుణం
  • ఏడేళ్ల బాలికను చంపి డ్రమ్ములో మృతదేహాన్ని కుక్కిన సైకో
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మదనపల్లె, మహా : అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఘోరం జరిగింది. కనిపించకుండా పోయిన ఏడేళ్ల బాలిక శవంగా కనిపించింది. పొరుగువారి ఇంటి ముందు డ్రమ్ములో విగతజీవిగా పడి ఉంది. పక్కింటి కులవర్ధన్ అనే వ్యక్తి ఇంట్లో డ్రమ్ములో మృతి చెంది కనిపించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా మదనపల్లెలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కులవర్ధన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లిలో ఏడేళ్ల బాలిక రిషిక ప్రియ దారుణంగా హత్య చేశారు. సోమవారం సాయంత్రం నుంచి బాలిక కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టుపక్కలవారు కూడా బాలిక కోసం వెతికారు. అయినా లాభం లేకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కీలక విషయం తెలుసుకున్నారు.

బాలిక మిస్సింగ్‌తో పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. పక్కింటి కులవర్ధన్ బాలికను తీసుకెళ్లాడు. దీంతో అందరూ కలిసి వెళ్లి బాలిక కోసం వెతికారు. చివరకు బాలిక మృతదేహం డ్రమ్ములో కనిపించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు విగత జీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో మదనపల్లెలో విషాదం నెలకొన్నది. కులవర్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సైకోలాగా ప్రవర్తిస్తాడని స్థానికులు అంటున్నారు. బాలిక ఇంటి పక్కనే ఉండే కులవర్ధన్ మాయమాటలు చెప్పి బాలికను తీసుకెళ్లినట్టుగా ప్రాథమికంగా తెలిసింది. కిరాతకంగా హత్య చేసి ఆపై మృతదేహాన్ని డ్రమ్ములు కుక్కాడు. అత్యాచారం జరిగిందా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం జరిగిన తర్వాత బాలిక మరణానికి కారణాలు చెబుతామని పోలీసులు అంటున్నారు.

బాలికను దారుణంగా హత్య చేసి డ్రమ్ములో కుక్కిన ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిందితుడిని తమకు అప్పగించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. జిల్లా ఎస్పీ ధీరజ్ కొనిపెల్లి డీఎస్పీ , సిబ్బందితో విస్తృత ఏర్పాట్లు చేశారు. బాలిక హత్య కేసులో నిందితుడి ఇంటి వద్దకు స్థానికులు వేలాదిగా తరలివచ్చారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమయంలో ఏం జరిగిందో తెలియకపోయినా అక్కడ ఉన్న ఓ వ్యక్తిపై కొందరు స్థానికులు పిడిగుద్దులు గుద్దారు. పరిస్థితి అదుపు తప్పుతుందనే ఆందోళనతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని ఆ వ్యక్తిని గుంపు నుంచి పక్కకు తీసుకెళ్లారు. పరిస్థితి మరింత అదుపు తప్పకుండా ఉండేందుకు నిందితుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే రిషి హత్య కేసులో ముద్దాయిని నడిరోడ్డుపై శిక్షించాలని కోరుతూ స్థానికులు రోడ్డెక్కారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి వెళ్ళమని భీష్మించుకు కూర్చున్నారు. వందల కొలది వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.

హోం మంత్రి స్పందన

పక్కింట్లోని బాలికను దారుణంగా హత్య చేసి డ్రమ్ములో కుక్కిన ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. జరిగింది చాలా ఘోరమన్నారు. అభం శుభం తెలియని చిన్నారిని చిదిమేయడం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. నిందితుడెవరైనా కఠినంగా చర్యలు తీసుకుంటామని, ఇందులో ఎవరిని ఉపేక్షించబోమన్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడా లేదా అన్నది తెలుస్తుందని, చట్ట ప్రకారం నిందితుడికి శిక్ష పడేలా చూస్తామన్నారు. పోలీసులకు స్థానికులు సహకరించాలని కోరారు

Latest