Mahaa Daily Exclusive

  మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు…

Share

  • మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు
  • ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు
  • విద్యాశాఖ కీలక ప్రకటన

హైదరాబాద్, మహా : తెలంగాణలో ఒంటిపూట బడులు, వేసవి సెలవులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు మొదలుపెట్టాలని నిర్ణయించింది. అదే సమయంలో ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. ఇక రంజాన్ సందర్భంగా పాఠశాల తరగతుల సమయాల్లో మార్పులు చేసింది. మార్చి 16వ తేదీ నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి వేళలను కూడా వెల్లడించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని సూచించింది. ఇక పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒంటిపూట తరగతులను నిర్వహించాలని వెల్లడించింది. అదే సమయంలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి.. వేసవి సెలవులపైనా తెలంగాణ విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి రాష్ట్రంలో స్కూళ్లకు ఎండాకాలం సెలవులు ప్రారంభం అవుతాయని వెల్లడించింది. ఇక 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 12వ తేదీ నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నట్లు విద్యా శాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఈనెల 19వ తేదీ నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే రంజాన్ సందర్భంగా కొన్ని పాఠశాల సమయాల్లో మార్పులు చేస్తూ.. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ఎయిడెడ్ ఉర్దూ మీడియం స్కూళ్లలో టైమ్ టేబుల్ మార్చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఈ స్కూళ్లలో తరగతులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. అవసరం అయితే వారంలో ఒక రోజు అదనపు క్లాసులు నిర్వహించాలని ఆదేశిస్తూ తెలంగాణ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Latest