- కూకట్‌పల్లిలో దారుణం
- నాలుగు రోజులుగా ఇంట్లోనే శవం
- ప్రార్థనల పేరుతో కుటుంబం పిచ్చి పని
- పోలీసుల జోక్యంతో శవాన్ని తరలించిన కుటుంబీకులు
హైదారాబాద్, మహా : యువతి చనిపోయి 4 రోజులు గడిచింది. అంత్యక్రియలు చేయాల్సిందిపోయి ఆ కుటుంబం ప్రార్థనలతో పిచ్చిగా ప్రవర్తించింది. ఇరుగుపొరుగు వారు ప్రశ్నిస్తే మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం అడగటానికి మీరెవరని ఎదురు సమాధానం. శవం నుంచి దుర్వాసన వస్తున్నా మెుండిగా ఇంట్లో అలాగే ఉండిపోయారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లిలో చోటు చేసుకుంది. కూకట్‌పల్లి పోలీసులు తెలిపిన ప్రకారం.. ఏపీలోని ఏలూరుకు చెందిన ఏసురత్నం కుటుంబంతో సహా.. 40 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. నగరంలోనే ఏఎస్సైగా పనిచేసిన ఏసురత్రం పదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ప్రస్తుతం ఆయన భార్య శమంతకమణితో పాటు ఇద్దరు కుమార్తెలు శైలజ, సునీత, కుమారుడు జయరాజ్‌లు ఉన్నారు. వీరు కూకట్‌పల్లి రామకృష్ణానగర్‌లోని శ్రీసాయి భరద్వాజ్ అపార్ట్‌మెంట్‌లో గత కొన్నేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. అయితే పిల్లలు ముగ్గురికి పెళ్లిళ్లు కాలేదు. కొన్నాళ్ల క్రితం శైలజ ఆరోగ్యం పాడైంది. ఈ క్రమంలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఈ నెల 13న కన్నుమూసింది.
అదే రోజు శైలజ మృతదేహాన్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ఫ్రీజర్‌ను తీసుకొచ్చి అందులో శవాన్నిపెట్టి ఇంట్లోనే ఉంటున్నారు. అంత్యక్రియల గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. అవసరమైనప్పుడు తలుపులు తీసి సాధారణంగా రోజువారీ పనులు పూర్తి చేసుకొని మళ్లీ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటున్నారు. పక్కింటి వాళ్లు కలుగజేసుకుని అంత్యక్రియల విషయమై ఆ కుటుంబ సభ్యులను నిలదీశారు. అందుకు వాళ్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. తాము ప్రార్థనలు చేసుకుంటున్నామని.. అంత్యక్రియలు మా ఇష్టం వచ్చినపుడు చేసుకుంటాం.. అడగడానికి మీరెవరంటూ స్థానికులతో వాదనకు దిగారు. శవం నుంచి దుర్వాసన కూడా వస్తుండటంతో స్థానికులు చేసేదేం లేక పోలీసులకు సమాచారం అందించారు. కూకట్‌పల్లి పోలీసులు ఇంటికి చేరుకొని వారిని అంత్యక్రియల గురించి అడగ్గా.. వారికి కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామంటూ తలుపులు తీయకుండానే పోలీసులతో గొడవకు దిగారు. వెంటనే అంత్యక్రియలు నిర్వహించకుంటే తామే జీహెచ్‌ఎంసీకి అప్పగిస్తామని పోలీసులు వార్నింగ్ ఇవ్వటంతో దిగొచ్చారు. శైలజ మృతదేహాన్ని సొంతూరు ఏలూరుకు తరలించారు. కాగా, మృతురాలి మానసిక పరిస్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. ఆ కుటుంబం ఎవరితోనూ కలవరని, మాట్లాడరని అంటున్నారు.








