Mahaa Daily Exclusive

  మాది భూమిపుత్రుల జాతి…. కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో కేటీఆర్

Share

 

హైదరాబాద్, మహా

‘తెగువ ఉన్న, పౌరుషం ఉన్న భూమి పుత్రుల జాతి మాది. అధిష్టానం ఆడిస్తే ఆడే తోలుబొమ్మల జాతి కాదు మాది. తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయి. ఒకటి తెలంగాణవాదుల జాతి, రెండోది తెలంగాణ ద్రోహుల జాతి. మాది ఫైటర్ల జాతి, మీది ట్రెయిటర్ల (ద్రోహుల) జాతి. గుర్తుపెట్టుకో రేవంత్..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘జాతి మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్లు మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఏ జాతికి నువ్వు జాతి పిత? ఏ జాతి అని మాట్లాడుతున్నావు?. ’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాయకుడు కాదు.. ఒక ఉద్యమం పుట్టినరోజు

‘నేడు ఒక నాయకుడి పుట్టిన రోజు కాదు. ఒక ఉద్యమం పుట్టిన రోజు’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. చరిత్ర పుట్లలో శాశ్వతంగా నిలిచే నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఒక కౌన్సిలర్ పదవి కోసం కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధాలు, పొత్తులు చూశామని.. పదవి కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టి కలిసిపోయాయని ఆరోపించారు. కానీ.. కేసీఆర్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్, కేంద్ర మంత్రి పదవులను గడ్డి పోచలుగా త్యాగం చేసి రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. ఓటమి తాత్కాలికమని.. మళ్లీ కేసీఆర్ వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. అనంతరం కేసీఆర్ జన్మదిన వేడుకలు మాజీమంత్రి, డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్, యువ నాయకుడు తలసాని సాయి కిరణ్‌యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని 72 కిలోల భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమం నేపథ్యంతో రూపొందించిన పాటలు, డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ తన ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి గా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, సుధీర్‌రెడ్డి, తెలంగాణ భవన్ ఇన్‌చార్జి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest