Mahaa Daily Exclusive

  అమెరికా-భారత్ మధ్య ‘సబ్​సీ కేబుల్ రూట్…

Share

  • అమెరికా-భారత్ మధ్య ‘సబ్​సీ కేబుల్ రూట్
  • – లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు
  • గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
  • అదానీ ఏఐతో చేతులు కలిపిన గూగుల్

ఢిల్లీ, మహా
ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో భారత్‌ అసాధారణ రీతిలో ముందుకు సాగుతోందని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ చెప్పారు. భారత ఏఐ పరివర్తనలో భాగస్వామ్యం అయ్యేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేస్తున్న ఏఐ హబ్‌ను గుర్తుచేసిన ఆయన, తాజాగా అమెరికా-భారత్‌ పేరిట కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. అమెరికా, భారత్, దక్షిణ గోళార్ధంలోని పలు ప్రాంతాల మధ్య ఏఐ కనెక్టివిటీని మెరుగుపర్చడానికి కొత్త సబ్‌సీ కేబుల్ రూట్‌లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మరోవైపు ఏఐ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నట్లు వివరించిన సుందర్ పిచాయ్, ఆరోగ్య సంరక్షణ డయాగ్నస్టిక్స్‌ను మెరుగుపర్చడం నుంచి రైతులకు రియల్-టైమ్ అలర్ట్‌లు అందించడం వరకు అనేక సమస్యలను పరిష్కరించవచ్చని వివరించారు. భారతదేశ వైవిధ్యం, భాషా వ్యవస్థ, బలమైన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నూతన ఆవిష్కరణలకు శక్తిమంతమైన పునాది అని పేర్కొన్నారు. ఏఐ వినియోగంలో విశ్వాసం, భద్రత, సమగ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సుందర్‌ పిచాయ్ సూచించారు. సాంకేతికత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, ఫలితాల ఆధారంగా ఉన్నప్పుడు ప్రజలకు నమ్మకం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. “పర్సనల్‌ ఏఐ అసిస్టెంట్ జెమినై యాప్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భారత్‌ మా అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. భారత్‌లో మాట్లాడే పది భాషల్లో ఇది అందుబాటులో ఉంది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గత ఏడాది 15బిలియన్‌ డాలర్లతో విశాఖలో ఏఐ హబ్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించాం. ఇది గిగావాట్‌ స్థాయిలో ఏర్పాటవుతుంది. సరికొత్త ప్రపంచస్థాయి సముద్ర కేబుల్‌ గేట్‌గా మారుతుంది. కటింగ్‌ ఎడ్జ్‌ ఏఐ ద్వారా ఉద్యోగాలు వస్తాయి. భారత్‌లోని అన్ని ప్రాంతాల ప్రజలు, వ్యాపారవేత్తలకు సేవలు అందుతాయి” అని సుందర్ పిచాయ్ తెలిపారు.

అమెరికా-భారత్ మధ్య సముద్ర కేబుల్

“ఇవాళ కొత్తగా భారత్‌-అమెరికా అనుసంధాన ప్రక్రియను ప్రకటిస్తున్నాం. దీని ద్వారా సరికొత్త సముద్ర కేబుల్స్‌ వస్తాయి. అమెరికా-భారత్‌ మధ్య ఏఐ అనుసంధానం మరింత పెరుగుతుంది. దక్షిణార్థ గోళంలోని అనేక ప్రాంతాల్లో ఈ కేబుల్స్‌ వస్తాయి. ఈ మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకునేలా యువతలో నైపుణ్యాలు పెంచేందుకు పెట్టుబడులు పెడతాం. ఇది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నైపుణ్యాభివృద్ది కార్యక్రమమని స్పష్టంగా చెబుతున్నాను. ఎందుకంటే యువత, ఉద్యోగులు తమ పనుల్లో ఏఐని పెద్దఎత్తున ఉపయోగించుకునేలా సర్టిఫికేషన్‌ కోర్సులను అందిస్తాం. భారత్‌లో ఈ సేవల కోసం అదానీ ఏఐతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సేవలను మొదట ఆంగ్లం, హిందీలో అందుబాటులోకి తెస్తాం. తర్వాత మిగతా భాషల్లోనూ ప్రవేశపెడతాం. ఇది గిగావాట్-స్థాయి కంప్యూట్, అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్ గేట్‌వేను కలిగి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగాలు, అధునాతన ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దేశానికి వస్తాయి” అని సుందర్ పిచాయ్​ చెప్పారు.

Latest